కల్వకుంట్ల కవిత కొత్తగా గాంధీ కుటుంబాన్ని దూషించడం ప్రారంభించారు. రాహుల్ గాంధీ అప్ డేట్స్ లేని అవుట్ డేటెడ్ నాయకుడని .. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని విమర్శిస్తున్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ఆపలేకపోతున్నారు కాబట్టే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అయ్యిందన్నారు. జగిత్యాల పార్టీ మీటింగ్లో కవిత ప్రసంగం మొత్తం కాంగ్రెస్ నే టార్గెట్ చేసుకున్నారు. పనిలో పనిగా మోదీపై ప్రశంసలు కురిపించారు.
హఠాత్తుగా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తే.. మోదీని కవిత ఆహా..ఓహో అని ఎదుకు అంటున్నారన్న అనుమానం చాలా మందికి వస్తోంది. కవిత మాటలు విన్న వారికి ఏదో తేడాగా ఉందే అనిపించక మానదు. నిజంగానే తేడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కాం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్రన్ పిళ్లై అప్రూవర్ గా మారి.. ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరంచారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు.
ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం పరిణామాలు వేగంగా మారుతూండటంతో.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కవిత.. స్వరం మార్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.