టీడీపీ- జనసేన దోస్తానా నిన్నా మొన్నటి వరకూ ముసుగులోనే సాగింది. ఇప్పుడు జగన్ రెడ్డి పుణ్యమా అని… పూర్తిగా బహిర్గతమైపోయింది. చంద్రబాబు అరెస్టుని ఖండించిన పవన్ కల్యాణ్, తను మామ్మాటికీ చంద్రబాబు వెనుకే ఉంటానని స్పష్టం చేయడంతో… వచ్చే ఎన్నికల్లో పొత్తు కన్‌ఫామ్ అయిపోయింది. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగడం, తన మద్దతు ప్రకటించడం.. టీడీపీ వర్గాల మనసుల్ని గెలుచుకొంది. ఇది వరకు జనసేనతో పొత్తుని టీడీపీ నాయకుల్లో ఒకరో ఇద్దరో వ్యతిరేకించే వాళ్లు ఉన్నా, ఇప్పుడు వాళ్లు కూడా జనసేన సైడ్ తీసుకోవడం గ్యారెంటీ. లోకేష్ సైతం `నా వెంట మా అన్న పవన్ ఉన్నాడు` అని చెప్పడం పొత్తుకు మరింత బలాన్ని తీసుకొచ్చినట్టైంది.
పక్కా టీడీపీ అనిపించుకొన్న కొన్ని ఛానళ్లు కూడా పవన్‌ని ఓ రేంజ్‌లో మోస్తున్నాయిప్పుడు. కష్టకాలంలో అండగా నిలబడే వాడే స్నేహితుడు అంటూ.. పవన్‌ని భుజాన ఎత్తుకొంటున్నాయి. రేపు.. జనసేన-టీడీపీ మధ్య సీట్ల పంపకంలో తూకం జనసేనవైపు మొగ్గడానికి సైతం, ఈ పరిణామాలు ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు సీట్లు జనసేనకు ఎక్కువిచ్చినా, టీడీపీ కంచుకోటల్లో సైతం జనసేన అభ్యర్థిని నిలబెట్టినా – ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే… కష్టకాలంలో పవన్ ముందుకొచ్చిన వైనం.. చూపించిన ఆ ధైర్యం అలాంటివి. స్కాము జరిగిందా, లేదా అనేది పక్కన పెడితే చంద్రబాబుని అరెస్టు చేసిన విధానం ఏమాత్రం హర్షించలేం. ఇది టీడీపీ సానుభూతి పరులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం తెలుసు. వాళ్లంతా ఇప్పుడు టీడీపీ – జనసేన పొత్తుని మరింత గట్టిగా కోరుకొంటున్నారు. ఇదంతా అచ్చంగా జగన్ చలవే.