మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తానని చెప్పే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో అలాంటి మహిళా కోటా కోసం ప్రయత్నం చేసి దాదాపుగా సక్సెస్ అయ్యారు. నేరాల్లో విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. మహిళల్ని విచారణ కోసం ఒత్తిడి చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని.. ఆ మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతున్నాయని కవిత లాయర్లు వాదించారు.
నళిని చిదంబరం విషయంలో కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు విచారణ కోసం ఒత్తిడి చేయవద్దని కోర్టు చెప్పిందని.. ఇదే తరహా ఆదేశాలను కవితకు కూడా వర్తింప చేయాలన్నారు. మరో కేసులో కస్టమ్స్ యాక్ట్ అంశంలోనూ మహిళలపై కఠినంగా వ్యవహరించవద్దు అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మనీలాండరింగ్ చట్టంలో కూడా మహిళలకు రక్షణ కల్పించాలని చెబుతోందని.. బెయిల్ కోసం ఉద్దేశించిన సెక్షన్ 45లో కూడా మహిళలకు వెసులుబాటు కల్పించాలని ఉందని కవిత తరపు లాయర్ తెలిపారు. కాబట్టి మహిళలను ప్రత్యేక కేటగిరీగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై తుది ఉత్తర్వులు వెలువడాలని.. ఫైనల్ హియరింగ్ కోసం డేట్ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు ఈ సమన్లను వాయిదా వేయాలని కోరారు. అయితే ఇప్పటికే 10 రోజుల సమయం ఇచ్చామని ఈడీ తెలిపింది.
ఇప్పుడు ఆమె బిజీగా ఉంటే, మరో 10 రోజులు సమయం పొడిగిస్తామని ఈడీ తెలిపింది. అంతే తప్ప సమన్లను నిరవధికంగా వాయిదా వేయడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. చివరికి పది రోజులు విచారణకు చేయబోమని ఈడీ హామీ ఇచ్చారు. చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే.. అందులో మహిళను అని విచారణకు మినహాయింపు కావాలని వాదించడం ఏమిటన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈడీ విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారేమోన్న కారణంగా కవిత వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.