అసెంబ్లీ పెట్టి ఆరు నెలలవుతోంది. పెట్టకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. దీంతో తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో జగన్ రెడ్డి ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు ఇందులో ఏం చేస్తారంటే… చంద్రబాబుపై ఆధారాలు లేకుండా పెట్టిన కేసుల గురించి చర్చిస్తారట.
ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షంపై ఇలా తప్పుడు కేసులు పెట్టి వాటిని అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని చెప్పడం …దేశ చరిత్రలోనే ఉండదు. కేసులు పెట్టినప్పుడు దర్యాప్తు చేసి కోర్టులో పెట్టి శిక్షింప చేయాలి. కానీ ఒక్క ఆధారం లేకుండా బట్ట కాల్చి మీద వేయడమే కేసులన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారశైలి కోసం అసెంబ్లీని వాడుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన అసెంబ్లీ చివరికి రాజకీయ కక్షల కేసుల కోసం చేసే దుష్ప్రచారానికి వేదిక అవుతోంది.
ఇప్పటికే అన్ని వ్యవస్థలనూ జగన్ రెడ్డి సర్కార్ నాశనం చేసింది. అసెంబ్లీ సమావేశాలను సైతం నామమాత్రంగా మార్చేశారు. ఇప్పుడు వాటినీ ప్రతిపక్షంపై తప్పుడు ప్రచారాలకు వాడుకుంటున్నారు. ఇక ఏపీ ప్రజలకు శాసనవ్యవస్థ ద్వారా కూడా మంచి జరుగుతుందన్న ఆశ లేకుండా పోతోంది.