కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరారు. ఆయనకు కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఉదయమే ఆయన బీఆర్ఎస్ పార్టకి రాజీనామా చేశారు. అయితే షర్మిలను మాత్రం పార్టీలో చేర్చుకోలేదు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను షర్మిల కలిసినట్లుగా ప్రచారం జరిగింది. పార్టీని విలీనం చేసే విషయంలో ఏం చేయాలన్నదానిపై చర్చించినట్లుగా చెబుతున్నారు. ఒక రోజు ముందు డీకే శివకుమార్ నూ కలిశారు.
ఎవరి దగ్గర నుంచి కూడా హామీ లభించకపోవడంతో షర్మిల నిరాశగా వెనుదిరిగినట్లుగా చెబుతున్నారు. ఈ సారికి షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. షర్మిలను చేర్చుకునే విషయంలో తెలంగాణ నేతలు ఏ మాత్రం ఆసక్తిగా లేరు. అసలు వద్దే వద్దని వాదిస్తున్నారు. ఆమెను తెలంగామలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలనుకున్న హైదరాబాద్లో చేరిక ప్రోగ్రాం వద్దని తేల్చినట్లుగా చెబుతున్నారు. దీంతో షర్మిల చేరికను హైకమాండ్ పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు.
షర్మిల పరిస్థితి ఎటూ కాకుండా పోతోంది. అటు ఆమె సొంత పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు. ఇటు కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత లేదు. ఎలా చూసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీకి షర్మిలకు అవకాశం దొరకదు. ఇప్పుడు షర్మిల ఏం చేస్తారన్నది కీలకంగా మారింది. ఆమె పార్టీ ద్వారా పాలేరులో పోటీ చేసినా కనీసం మూడు, నాలుగు శాతం కూడా ఓట్లు రావని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.