సీబీఐ కోర్టుల్లో జగన్ రెడ్డి కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందంటే.. ఆయన వేసే రకరకాల పిటిషన్లు అనే కారణం కనిపిస్తోంది. కానీ దీనికి చంద్రబాబు కూడా ఓ కారణం అని ఆర్కే చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు కోర్టులకుగాను ఒకే కోర్టులో న్యాయాధికారి ఉండేవారట. అప్పట్లో సీబీఐ.. చంద్రబాబుకు ఓ సిఫారసు వచ్చింది. న్యాయాధికారుల నియామకానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.కానీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు మిన్నకుండి పోయారట. నిజంగా అదే చంద్రబాబు నైజమని ఆయన పరిపాలనలో అధికారులుగా ఉన్న వారే కాదు.. జనానికి కూడా సులువుగానే అర్థమవుతుంది.
అలాంటి వ్యక్తిని ఇప్పుడు జగన్ రెడ్డి ఆధారాలు లేని కేసుల్లో అరెస్టులు చేసి జైలుకు పంపడం ఏమిటన్నది అందరిలోనూ వస్తున్న ప్రశ్న. ఆర్కే కూడా అదే చెబుతున్నారు. తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో చంద్రబాబు గురించి.. ఆయన సాఫ్ట్ నైజం గురించి చాలా వివరాలు వెల్లడించారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందో కూడా చెప్పారు. అదే సమయంలో.. స్కిల్ కేసులో చాలా విషయాలు వెల్లడించారు. ఏపీలో చేతులు మారాయంటున్న డబ్బులు. షెల్ కంపెనీల గురించీ పూసగుచ్చినట్లుగా చెప్పారు. చంద్రబాబుకు కానీ.. ఏపీలో ప్రాజెక్టు అమలు చేసిన వారిలో ఎవరికీ.. ఒక్క రూపాయి కూడా అందిందన్నడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి జేబు సంస్థ శరత్ అసోసియేట్స్ చేసిన ఆడిటింగ్ లోనూ ఆర్థిక అవకతవకలు బయటపడలేదు. ఆ విషయాన్ని ఈ సంస్థ ఈడీకి కూడా చెప్పిందని అంటున్నారు.
ఇక అసలు ఏ తప్పూ జరగలేదని.. జరగని తప్పును జరిగినట్లుగా చూపించడం ద్వారా చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేశారు కానీ.. అక్కడ ప్రొసీజర్ అధికారులది కానీ.. ముఖ్యమంత్రిది అవుతుందని ఎలా నిర్ధారించారనేది ఆర్కే వేసిన ప్రశ్న. ఇది సహజంగానే అందరకీ వస్తున్న సందేహం. ఏసీబీ కోర్టు న్యాయాధికారికిగా ఎందుకు రాలేదో.. అసలు ఆ న్యాయాధికారి కనిపించిన ప్రాథమిక సాక్ష్యాధారాలేమిటో అర్థం కానివని ఆర్కే చెబుతున్నారు.
మొత్తంగా ఆర్కే ఈ వారం తన కొత్తపలుకులో .. స్కిల్ ప్రాజెక్టు కేసు గురించి పూర్తి స్థాయిలో సరళమైన భాషలో వివరించే ప్రయత్నం చేశారు. ఆరు రాష్ట్రాల్లో జరిగినట్లే జరిగిందని తేల్చారు. కానీ ఏపీలోనే ఈ కేసుకు సంబంధించి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. కళ్ల ముందు కనిపించే నిజాల్ని నమ్మే వారికి ఈ ఆర్టికల్ చాలా సమాచారాన్ని ఇస్తుంది. గుడ్డిగా జగన్ రెడ్డి ఏం చెబితే అదే నిజమనుకునేవారికి ఇది కూడా నమ్మకంగా అనిపించదు.