వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ జీవితం రిస్క్‌లో పడిపోయింది. ఆమెను చేర్చుకునేందుకు..పార్టీని విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపించడం లేదు. అలాంటి ఆలోచనే ఉంటే.. తుమ్మల నాగేశ్వరరావు కు కండువా కప్పి ఆమెను వెయిటింగ్లో ఉంచేవారు కాదు. షర్మిల చేరికను తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు సమర్థిస్తున్నా … ఆయనకే ప్రాధాన్యం దక్కడం లేదు.
ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదు. కాంగ్రెస్ లో విలీనం చేసి ఓ టిక్కెట్ వస్తే పాలేరు నుంచి గెలిచేస్తానని ఆశలు పెట్టుకుని సొంత పార్టీ వ్యవహారాల్ని నిలిపివేశారు. ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ ఠికాణా లేదు. చేర్చుకుంటారన్న గ్యారంటీ లేదు. కనీసం ఏపీ పగ్గాలివ్వడానికి కూడా సిద్ధపడటం లేదు. అక్కడ జగన్ రెడ్డితో ఇప్పటికే లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఆమె పోటీ చేస్తే.. పాలేరులో మూడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. నిజంగా ఇలాంటి పరిస్థితే ఉంటే.. ఆమె పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం తప్ప మోర ప్రశ్న ఉండదు.
అంతకు మించి తెలంగాణ లో కనీస ప్రభావం చూపించలేకపోతే ఏపీలో రాజకీయాలు చేయాలన్న ప్రజలు ఆహ్వానించరు. అక్కడ పట్టించుకోకపోతే ఏపీకి వచ్చారన్న విమర్శలు ఎదుర్కొంటారు. ఇప్పుడు షర్మిల కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ లో చేరి.. సైలెంట్ గా ఉండటమా.. మొండిగా ముందుకెళ్లడమా అన్నది కీలకం. కాంగ్రెస్ లో చేరాలంటే.. తెలంగాణ ఎన్నికల తర్వాతే వారు ఆహ్వానించే అవకాశం ఉంది.