తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధినాయకత్వానిదేనని ఆమె చెప్పుకొచ్చారు. టిడిపితో పొత్తుపై తాను బిజెపి అగ్ర నాయకత్వానికి వివరిస్తానని అన్నారు. తమ జనసేన పార్టీ ఎన్డీఎలో కొనసాగుతుందని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను ఆమె గుర్తు చేశారు.
పనిలో పనిగా చంద్రబాబు అరెస్ట్ ను తామే మొదట ఖండించామని అన్నారు. కేంద్రానికి అరెస్ట్ తో ఏ సంబంధం లేకపోయినా మోడీని నిందించడం తగదని అన్నారు. కానీ ఈ అరెస్టులో కేంద్రం మద్దతు లేరంటే ఎవరూ నమ్మరు. పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ కూడా లేకుండా … అర్థరాత్రి అరెస్టు చేసి నలభై ఎనిమిది గంటల పాటు నిద్ర లేకుండా చేసి తిప్పారంటే.. అది చిన్న విషయం కాదు. అది కూడా జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నేత. తనపై దారుణమైన కుట్రలు పన్నుతున్నారని రాష్ట్రపతి, ప్రధానిలకు కూడా లేఖలు రాసిన నేత ఆయన.
స్కిల్ కేసులో అన్నీ కళ్ల ముందే ఉంటే సిమెన్స్ లేదని.. మరొకటని చేసిన తప్పుడు ప్రచారాలన్నీ తేలిపోయినా ఇంకా అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ విచారణాధికారులు, ఏఏజీ లాంటి వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ , ఢిల్లీల్లో ప్రెస్ మీట్లు పెడుతూంటే.. కనీసం నిలువరించలేనంత దుర్భరమైన ప్రభుత్వం కేంద్రంలో ఉంటుదని ఎవరూ అనుకోరు. జరుగుతున్న నాటకం మొత్తం బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోంది. కానీ రాష్ట్ర నేతలు మాత్రం ఆశలు పెట్టుకుంటున్నారు . ఇప్పుడు బీజేపీ మేము పొత్తునకు ఓకే అన్నా… జగన్ రెడ్డితో బీజేపీ కటీఫ్ చెప్పిందని గట్టి చర్యలు ఉంటే తప్ప.. టీడీపీ అంగీకరించే అవకాశం లేదు.