మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మార్పుపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మంత్రి హరీశ్‌రావుపై హాట్ కామెంట్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు మైనంపల్లి గురించే చర్చ జరుగుతోంది. మైనంపల్లి మాత్రం వారం, పది రోజులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్పితే నిర్ణయం ప్రకటించడం లేదు. ఇక బీఆర్ఎస్ అధిష్టానం కూడా మైనంపల్లిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు మైనంపల్లి, ఇటు బీఆర్ఎస్ అధిష్టానం ఇద్దరూ నిర్ణయాలు ప్రకటించకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.
ఎమ్మెల్యే మైనంపల్లి ఇంకా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు. ఇప్పటికే రెండు సార్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసిన మైనంపల్లి, ఈ నెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరేలా కూడా కనిపించడం లేదు. మంత్రి కేటీఆర్‌తో భేటీకి ఆవకాశం ఉన్నా.. సీఎం కేసీఆర్‌ను కలిసి స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ సమాచారం చేరినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మైనంపల్లితో భేటీ అవుతారా..? లేక లైట్ తీసుకుంటారా..? అనే విషయం త్వరలోనే తేలనుంది. సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత స్పష్టమైన హామీ రాకపోతే పార్టీ మారే యోచనలో మైనంపల్లి ఉన్నట్టు సమాచారం.
మైనంపల్లి బీఆర్ఎస్లో కొనసాగినా ఆయనపై కేసీఆర్ నమ్మకం పెట్టుకోరన్న వాదన కూడా ఉంది.అయితే బ లమైన నాయకుడు కావడంతో బయటకు పంపలేకపోతున్నారని.. ఆయన వెళ్తానంటే మాత్రం ఆపే ఉద్దేశం లేదని నేరుగా చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ రెండు టిక్కెట్ల హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్నా.. ఆయన నిర్ణయం ప్రకటించలేదు.