జోగి బ్రదర్స్ తరహాలో కామెడీ చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పెడుతున్న ప్రెస్ మీట్లు.. అనేక రకమైన సందేహాలను ప్రజల్లో తీసుకువస్తున్నాయి. కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి… కోర్టుకు అసలు విషయం చెప్పకుండా ఊళ్లు తిరుగుతూ…. కోర్టులో సమర్పించిన వాటిని బయటపెడుతూండటం సంచలనంగా మారింది. వీరికి వ్యవస్థల పట్ల అంత చులకన భావం ఏమిటన్న అనుమానం వస్తోంది.
అదే సమయంలో సీబీఐ అధికారులు ఎందుకు ప్రెస్మీట్ పెట్టలేదని.. వైఎస్ వివేకా హత్య కేసులో వారు కూడా ఇలాగే మీడియా ట్రయల్ నిర్వహిస్తే ఏమవుతుందన్న చర్చ నడుస్తోంది. వివేకా హత్య కేసులో కళ్ల ముందు కనిపించే సంచలన వాస్తవాలు ఉన్నాయి. ఎంతో మంది సాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్లు ఉన్నాయి. హత్య జరిగిన వెంటనే .. జగన్ రెడ్డికి సమాచారం వచ్చిందని తెలిపేలా… కల్లాం అజేయరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా ఉంది. ఆడియో టేపులు కూడా ఉన్నాయని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పారు. మరి వారెందుకు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పకుండా కోర్టుకు చెబుతున్నారు ?
ఆధారాలు లేకుండా బురద చల్లేందుకు ఊరూవాడా ప్రజల డబ్బులతో తిరిగేస్తున్నారు పెద్దలు. అన్ని ఆధారాలు ఉన్నా… తాము కోర్టులకు మాత్రమే చెప్పాలి కాబట్టి సీబీఐ అధికారులు అదే పని చేస్తున్నారు. అదే సీబీఐ అధికారులు ఊరూరా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి వివేకా హత్యకేసు నిజాల్ని బయటపెడితే.. కొంతమంది సైకోయిజం గురించి పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు అవగాహన వస్తుంది. కానీ అలాంటివి పెట్టడం న్యాయవ్యవస్థను కించ పరిచినట్లే. ఆ పని సీఐడీ చేస్తోంది.