ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాత పార్లమెంట్ భవనంలో చివరి ప్రసంగం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు పాత భవనంలో ప్రసంగించారు. రేపట్నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరుగుతాయి. పాత భవనం గురించి ఆయన చాలా భావోద్వేగంతో ప్రసంగించారు. అయితే ఏ సందర్భం అయినా ప్రసంగం అంతా ఒకే లా ఉంటుంది. ఇప్పటికి ఏపీ విభజనపై ఎన్నో సార్లు మాట్లాడారు. పార్లమెంట్ తలుపులు మూసేసి విభజించారని… బీజేపీ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా సమస్యలు రాలేదని.. కానీ కాంగ్రెస్ ఏపీని విభజించి నాశనం చేసిందని చెబుతూ ఉంటారు.
ప్రధాని అలా అన్నారని ప్రచారం చేయడమే కానీ ఈ విభజనలో మేజర్ పార్ట్ బీజేపీదేనన్న సంగతిని మర్చిపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేసిన విభజన అది. సోనియా పెద్దమ్మ అయితే తాను చిన్నమ్మనని సుష్మాస్వరాజ్ చెప్పుకున్నారు. క్రెడిట్ కోసం రెండు పార్టీలు పోటీపడ్డాయి. ఏపీని పట్టించుకోలేదు. ఏపీకి ప్రత్యేకహోదా అంటూ వెంకయ్యనాయుడుతో నాటకం ఆడించారు. రెండు పార్టీలు కలిసి విభజించాయి. విభజనకు పార్లమెంట్ పూర్తి మద్దతు ఉందాలేదా.. నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా ఎవరికీ తెలియదు. కానీ రికార్డుల్లో మాత్రం జరిగిపోయింది.
రెండు రాష్ట్రాలను విడగొట్టి పదేళ్లవుతోంది. ఇప్పటికీ అదే చెబుతున్నారు. ఓ వైపు ఏపీలో ప్రజాస్వామ్యం ఉత్తరకొరియాలా మాట్లాడుతూంటే చూస్తూ ఉన్నారు కానీ.. పట్టించుకోలేదు. చట్టం అపహాస్యం పాలవుతున్నా.. రాజ్యాంగాన్ని పట్టించుకోకపోతున్నా.. దిక్కే లేకుండా పోయింది. సాక్షాత్తూ హైకోర్టు రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని తేల్చాలని నిర్ణయించింది. చివరికి న్యాయవ్యవస్థపై దాడులు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై నిందలు.. ఇలా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. కానీ అయిపోయిన అంశంపై మాత్రం.. ప్రతీ సారి లేవనెత్తి.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూంటారు. విభజనలో తమ రోల్ లేదన్నట్లుగా మాట్లాడుతూంటారు.