ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, రాజకీయాల గురించి కార్పొరేట్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ఎంత ఘోరంగా ఉందంటే… తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్ లో అయినా పెట్టుబడులు పెట్టవచ్చు కానీ.. ఏపీ జోలికి మాత్రం వెళ్లకూడదనుకుంటున్నారు. ఆఫ్గన్తో తాలిబన్లు తాము అనుకున్న చట్టాన్ని కఠినంగా అమలు చేసుకుంటారు. కానీ ఏపీలో మాత్రం.. తాము అనుకున్నదే చట్టం అన్నట్లుగా ఉంటారు. ఎవరికీ గ్యారంటీ లేదు. తప్పుడు కేసులో పెట్టుబడులు పెట్టిన వారినీ వేధింపులకు గురి చేస్తున్నారు.
సుమన్ బోస్ అనుభవాలు – ఏపీకి తీవ్ర నష్టం
సుమన్ బోస్ ఓ మల్టీనేషనల్ కంపెనీకి ఎండీగా చేశారు. ఆయన హయాంలో ఏపీకి సిమెన్స్ ద్వారా వచ్చిన ప్రాజెక్టుతో రెండున్నర లక్షల మంది ట్రైన్ అయ్యారు. ఇందులో నిజంగా స్కాం ఉంటే ఆధారాలు చూపించి అరెస్టు చేయాలి. కానీ రాజకీయ కక్ష సాధింపుల కోసం డబ్బులు ఆశ చూపడం.. శవాన్ని పక్కన పెట్టి బెదిరించడం వంటివి చేయడం మాత్రం కలకలం రేపుతున్నాయి. ఇంత క్రూర మైండ్ సెట్ ఉన్న పాలకుల దగ్గరకు కనీసం ఎవరూ రాను కూడా రారు. నాలుగున్నరేళ్లుగా అదే జరుగుతోంది. కియా లాంటి ఎఫ్డీఐ సాధించిన రాష్ట్రం… ఎందుకూ కొరగాకుండా పోయింది.
లూలూ వాళ్లు మొదట్లోనే చెప్పారు !
నిజానికి సుమన్ బోస్ కు ఏపీసీఐడీ వేధింపులు మొదటి సారి బయట పడ్డాయి. కానీ లూలూను వెళ్లగొట్టిన వ్యవహారంలోనే కార్పొరేట్ సర్కిల్స్ లో ఘోర ప్రచారం జరిగింది. ఏపీలో అసలు పెట్టుబడులు పెట్టబోమని లూలూ ప్రకటించడం సంచలనం అయింది. వారికి అంత ఘోరమైన అనుభవాలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఎంతో కష్టపడి లూలూను విశాఖకు తీసుకు వచ్చారు. దాన్ని తరిమేయమడానికి అనుచిత పద్దతుల్ని పాటించారు. చివరికి ఏపీ అంటేనే కార్పొరేట్ కంపెనీలు భయపడే పరిస్థితి.
బినామీ కంపెనీల పెట్టుబడుల పేరుతో రచ్చ
ఏపీలో ఏమైనా పెట్టుబడులు ఉన్నాయా అంటే… షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ , అదానీ, గ్రీన్ కో పెట్టుబడులు. ఈ పెట్టుబడులు ఉద్యోగాలిచ్చేవి కావు. వేల ఎకరాలు భూములు నొక్కేసేవి. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ పేరుతో వేల ఎకరాల భూములు నొక్కేసేవి. ఉద్యోగాల కల్పనే ఉండదు. చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే…. అన్యాయం, అవినీతి వాదించి జగన్ రెడ్డి అంతకు మూడింతుల ఒప్పందాలు రెట్టింపు ధరకు చేసుకున్నారు., ఇవే పెట్టుబడులని నమ్ముతున్నారు.
పరిశ్రమలు రావు… ప్రభుత్వ ఉద్యోగాలివ్వరు !
ఓ వైపు పెట్టుబడుల్ని తరిమేస్తున్నారు. అక్కడ యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. మరి ప్రభుత్వ రంగంలో అయినా అవకాశాలు ఇస్తున్నారా అంటే… వాలంటీర్ పోస్టులు తప్ప ఏమీ లేవు. ప్రతీ ఏడాది మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అంటూ కథలు చెప్పి చివరికి యువత చేతిలో చిప్ప పెట్టారు. కనీసం పోలీసు ఉద్యోగాలు అంటే కానిస్టేబుళ్ల నియామకాలనూ చేపట్టలేదు. రాష్ట్ర యువత ఐదేళ్ల భవిష్యత్ ను మాత్రమే కాదు.. ఓ తరం ఉపాధి కోసం వలస పోవాల్సిన ఘోరమైన పరిస్థితిని ప్రస్తుత పాలకులు కల్పించారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని నిట్టూర్పు తప్ప ఏమీ చేయలేం .