కొత్త పార్లమెంట్ భవనం నుంచి దేశానికి కొత్త ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించాలని ప్రధాని మోదీ గట్టిగా భావిస్తున్నారు. కేబినెట్ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. పార్లమెంట్ ఎజెండా ను తూతూ మంత్రంగా ఇచ్చారు కానీ అందులో ఏ వివరాలు లేవు. కేబినెట్ భేటీ తర్వాత ఒక్క మహిళా బిల్లుకు ఆమోదం అనే లీక్ ఇచ్చారు. కానీ అంతకు మించిన నిర్ణయాలు తీసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
జమిలీ ఎన్నికలు పెట్టేందుకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు, యూనిఫాం సివిల్ కోడ్ , ఇండియా పేరు భారత్ గా మార్పు సహా ఇంకా పలు కీలక బిల్లులు ఉన్నాయని చెబుతున్నారు. వాటికీ ఆమోదం లభించడమో లేకపోతే… మరోసారి ఆమోదం తీసుకోవడమో చేస్తారని అంటున్నారు. మరో నాలుగు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి., ఎప్పట్లా ప్రశ్నోత్తరాలు లాంటివి జరిగే అవకాశం లేదు. కేవలం స్పెషల్ ఎజెండా బిల్లుల కోసమే సమావేశ పరిచారు కాబట్టి… వాటిపైనే దృష్టి పెడతారు. ఆ బిల్లుల్లో ఒక్క మహిళా రిజర్వేషన్ ఒక్కటే కాదు అదీ కూడా ఒకటి.
టైమింగ్ చూసి అన్ని బిల్లులకూ ఆమోదం పొందుతారు. ప్రజల్లో ఆ తర్వాతే చర్చ జరుగుతుంది. అయిపోయింది కదా …. తప్పో ఒప్పో భరించాల్సిందే అన్న అభిప్రాయాన్ని కల్పిస్తారు. కానీ ఇలా ప్రజల్లో చర్చ లేకుండా.. పార్లమెంట్ లో చర్చ లేకుండా ఆమోదించిన వ్యవసాయ చట్టాలతో ఏం జరిగిందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా అలాంటి సాహసం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే కేంద్రం తెస్తుందని ప్రచారం జరుగుతున్న బిల్లుల్లో హైదరాబాద్ సహా నాలుగు మెట్రో నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారన్న బిల్లు కూడా ఉందని చెబుతున్నారు. అదే జరిగితే సీన్ మారిపోతుంది.