దర్శక ధీరుడు రాజమౌళి నుంచి అనూహ్యంగా ఓ కొత్త సినిమా కబురొచ్చింది. ఆయన సమర్పణలో `మేడిన్ ఇండియా` అనే సినిమా రాబోతోంది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రానికి నిర్మాత. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారు. ఇదో బయోపిక్. కాకపోతే…. వ్యక్తులకు సంబంధించినది కాదు. ఇండియన్ సినిమా పుట్టుపూర్వొత్తరాలు, చరిత్ర నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ చరిత్ర పాఠం లాంటి సినిమా అన్నమాట. సాధారణంగా నెట్ ఫ్లిక్స్లాంటి ఓటీటీ వేదికల్లో డాక్యుమెంటరీ లాంటి స్టఫ్ ఉన్న కంటెంట్. కాకపోతే.. దీన్ని సినిమాలానే తీయాలన్నది కక్కర్ ప్రయత్నం. ఇండియన్ సినిమాకు బీజం వేసి, దాని ఎదుగుదలకు ఇదోదికంగా సహాయం చేసినవాళ్లలో, భారతీయ చలన చిత్ర రంగం రెపరెపలాడించడంలో చాలామంది హస్తం ఉంది. ఉదాహరణకు.. రఘుపతి వెంకయ్య నాయుడు, సత్యజిత్ రే లాంటివాళ్లన్నమాట. వాళ్ల కథని చెప్పుకొంటూ దాంతో పాటు భారతీయ సినిమా ఎలా ఎదిగిందన్న పాయింట్ ఆఫ్ ఫ్యూలో ఈ సినిమా తీయబోతున్నారు. అంటే… ఇది భారత చలన చిత్ర రంగంలోని మహోమహుల కథన్నమాట. పదుల సంఖ్యలో కీలకమైన పాత్రలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. అందులో ఓ అమితాబ్ ఉండొచ్చు. ఓ చిరంజీవి ఉండొచ్చు. ఓ రాజమౌళి కూడా కనిపించొచ్చు. దర్శకుడు ఎంచుకొన్నది చాలా పెద్ద కాన్వాస్. మరి దాన్ని ఎలా రక్తి కట్టిస్తారో చూడాలి.