జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. అధికారికంగా సమాచారం అందడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి సేవ చేయడానికి అభ్యర్థులు సన్నధ్దమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడం సంతోషకరమని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
గాజు గ్లాసంటే.. అందరికీ గుర్తొచ్చేది జనసేన పార్టీనే. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఈ గుర్తుతోనే బరిలో నిలిచింది. ఆ గుర్తుతోనే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలోనే ఉన్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు అయినా దక్కించుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు.. 5.9 శాతం ఓట్లు వచ్చాయి.. ఒకే అసెంబ్లీ స్థానం గెలిచారు. అందుకే గుర్తింపు పొందలేకపోయారు.ఈ కారణంగా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ లో చేర్చారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన పోటీ చేయకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ జనసేన పొత్తులతో పోటీ చేయనుండటంతో గాజు గ్లాస్ గుర్తు కీలకం అయింది.
జనసేన పోటీ లేని చోట్ల గాజు గ్లాస్ ఉంటే సమస్య అవుతుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఈసీ రిజర్వ్ చేసినట్లుగా ప్రకటించడంోత.. ఓ సమస్య తీరిపోయినట్లయింది. ఇక ఇప్పుడు త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీ గుర్తు విషయంలో జనసేన నేతల విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి పార్టీకి మళ్లీ అదే గుర్తును కేటాయించింది.