మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పై నిర్మాత సురేష్ బాబు స్పందన ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలా వుంది. ఈ అంశంపై మీ స్పందన ఏమిటనే ప్రశ్నకు.. ఇండస్ట్రీ మొత్తానికి ముడిపెడుతూ ఓ రొటీన్ సమాధానం చెప్పి తప్పించుకున్నారు సురేష్ బాబు. తెలుగు సినీ పరిశ్రమకి ఏ రాజకీయ నాయకులకు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.
ఈ స్పందన విన్న జనాలు.. సురేష్ బాబు చక్కని కవర్ డ్రైవ్ ఆడారు గానీ స్లిప్స్ లో దొరికిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. తనకు వ్యక్తిగతంగా అడిగిన ప్రశ్నకు ఇండస్ట్రీ మొత్తానికి ముడిపెట్టేశారు సురేష్ బాబు. చంద్రబాబు అరెస్ట్ ఐతే ఇండస్ట్రీ స్పందనగా ఒక ప్రెస్ మీట్ పెట్టమనీ ఎవరూ కోరలేదు. వ్యక్తిగత స్పందనే అడిగారు. ఈ విషయంలో సురేష్ బాబు మరీ అమాయకంగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి సురేష్ బాబుకు రాజకీయ నేపధ్యం వుంది. తండ్రి రామానాయుడు తెలుగు దేశం ఎంపీగా చేశారు. రాజకీయ ప్రాభల్యం, పలుకుబడి లేకుండా కోట్ల విలువ చేసే స్టూడియోలు, స్థలాలు సొంతం చేసుకున్నారని చెబితే నమ్మేటంత అమాయకులు ఎవరూ లేరు. సినిమా నేపధ్యంలో రాజకీయ పలుకుబడిని వాడుకొని బోలెడు లబ్ది పొందిన కుటుంబం సురేష్ బాబుది.
ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడానికి భయపడుతున్న కారణం కూడా ఆస్తులే. వైజాగ్ లో స్టూడియో కోసం గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే స్థలాల్ని సురేష్ బాబు కి కేటాయించింది. ఇప్పుడు అక్కడ సినిమాలకి సంబధించిన ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. జగన్ ప్రభుత్వం ఆ భూములని తిరిగి గుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఇలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడితే ఏం జరుగుతుందో సురేష్ బాబుకి బాగా తెలుసు.
అందుకే పనిలో పనిగా ఎన్టీఆర్, చెన్నారెడ్డి తెలుగు సినిమా అభివృద్ధికి అత్యంత కృషి చేశారని..తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా సహకరించాని చెప్పి… చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ప్రత్యేకంగా చేసిన మేలు ఏమీ లేదట్లు చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు సురేష్ బాబు.
సురేష్ బాబు చాలా తెలివిగా స్పందించారని అనుకుంటున్నారేమో కానీ ఒక పౌరుడిగా తన అభిప్రాయాన్ని చెప్పే స్వేఛ్చ కూడా లేని పరిస్థితిలో వున్నారని ఆయన మాటలు విన్నవారికి అర్ధమౌతుంది. సురేష్ బాబు కప్పదాటు వైఖరని అర్ధం చేసుకోలేని అమాయకత్వంలో ఎవరూ లేరు.