ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎన్ ఎస్ కోసం సీ ఓటర్ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల అవకాశాలపై అభద్రతా భావంతో ఉన్నారని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టయిన తర్వాత సీఓటర్.. IANS ఏజెన్సీ కోసం సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
మొత్తం మీద 58 శాతం మంది రెడ్డి ఆందోళన, అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే చంద్రబాబును పోలీసు ఆపరేషన్ లో అరెస్టు చేయించారని అభిప్రాయపడ్డారు. సీ ఓటర్ సర్వే ప్రకారం ఈ అంశంపై పార్టీలకు అతీతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ మద్దతుదారులుగా గుర్తించిన వారిలో 86 శాతం మంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని ఆదేశించారని చెప్పారు. బీజేపీ మద్దతుదారులుగా గుర్తించిన వారిలో మూడింట రెండొంతుల మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులుగా గుర్తించిన వారిలో 36 శాతం మంది తమ నాయకుడు జగన్ రెడ్డి అభద్రతా భావానికి లోనవుతున్నారని అభిప్రాయపడ్డారు.
సొంత పార్టీ కార్యకర్తలు కూడా 36 శాతం మంది జగన్ రెడ్డి కి ఓటమి భయమని తేల్చడంతో వైసీపీ పని అయిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సొంత క్యాడర్ నూ పదే పదే వ్యతిరేకత తెచ్చుకుంటూండటం… ఓటమి భయంతో ఏం చేస్తున్నారో తెలియనట్లుగా ప్రవర్తిస్తూండటంతో… వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని వైసీపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వస్తున్నాయి.