Athidhi web series review
సినిమాలతో పాటు వెబ్ సిరిస్ లపై కూడా దృష్టిపెట్టారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో ’11th Hour’అనే వెబ్ సిరిస్ వచ్చింది. ఇప్పుడు ఆయన నిర్మాణంలో ‘అతిథి’ అనే హారర్ థ్రిల్లర్ సిరిస్ చేశారు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ సినిమాలతో అందరికీ సుపరిచితమైన వేణు తొట్టెంపూడి.. ఈ సిరిస్ తో ఓటీటీ లో అడుగుపెట్టారు. భరత్ దర్శకుడిగా ‘డిస్నీ+ హాట్స్టార్’లో విడుదలైన ఈ ఆరు ఎపిసోడ్ ల సిరిస్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది ? రాజుగారి కోటలోని రహస్యాలు ప్రేక్షకులని థ్రిల్ చేశాయా?
దెయ్యాలు ఉన్నాయా? లేవా ? ఇదే టాపిక్ పై యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటాడు సవారి (వెంకటేశ్ కాకుమాను). ఫలానా చోటు దెయ్యాలు వున్నాయని ప్రచారం జరిగితే అక్కడి వెళ్లి కెమరాతో చిత్రీకరించి దెయ్యాలు లేవని నిరూపించడమే అతని ఛానల్ కంటెంట్. ఆ క్రమంలో ఓ రోజు దెయ్యాల మిట్ట అనే ప్రాంతానికి వెళ్తాడు. దెయ్యలా మిట్ట గురించి అక్కడి ప్రజలు కథలు కథలుగా చెబుతుంటారు. అర్ధరాత్రులు ఆ దారిలో వెళ్ళడం మంచిది కాదని, అక్కడ దెయ్యాల బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హెచ్చరిస్తుంటారు. ఇవన్నీ ఉత్తి భ్రమలు అని నిరూపించడానికి అర్ధరాత్రి దెయ్యాలమిట్ట గుండా వెళ్తాడు సవారి. ఆ ప్రయాణంలో నిజంగానే అతనికి ఓ వింత అనుభవం ఎదురౌతుంది. భయంతో పరుగుతీసి .. అక్కడ దగ్గర్లో ఉన్న ‘సంధ్య నిలయం’ అనే ఓ పెద్ద భవంతి తలుపుతడతాడు సవారి.
సంధ్య నిలయం యజమాని రవివర్మ (వేణు తొట్టెంపూడి). అతనొక కథా రచయిత. ఆ పెద్ద భవంతిలో రవివర్మ, ఆయన భార్య (అదితి గౌతమ్) మాత్రమే ఉంటారు. రవివర్మ భార్య ఓ ప్రమాదంలో కాళ్ళు పోగుట్టుకుంటుంది. మంచానికి పరిమితమైన భార్యకు సేవలు చేసుకుంటూ, కథలు రాసుకుంటూ జీవిస్తుంటాడు రవి వర్మ. ప్రాణ భయంతో సంధ్య నిలయంలోకి వచ్చిన సవారికి, రవివర్మతో పాటు అక్కడ మాయా(అవంతిక మిశ్రా) అనే అమ్మాయి కనిపిస్తుంది. సవారి కంటే ముందే మాయ అక్కడ అతిధిగా వస్తుంది . మాయాని చూసిన సవారి తనతో పాటుగా దెయ్యం వచ్చిందని, ఆది మాయలో ప్రవేశించిందని అనుమాన పడతాడు. ఈ క్రమంలో కొన్ని అనూహ్యమైన పరిస్థితులలో మాయ చనిపోతుంది. మాయా ఎలా? ఎందుకు చనిపోయింది ? నిజంగా దెయ్యాల మిట్టలో దెయ్యాలు ఉన్నాయా? మాయా శవాన్ని మాయం చేయడానికి రవివర్మ, సవారి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? ఇంట్లోకి అతిధులుగా వచ్చిన ఈ ఇద్దరి కారణంగా రవివర్మ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ? అసలు రవి వర్మ ఎవరు ? అతని గతం ఏమిటి ? ఇవన్నీ తెలియాలంటే అతిధి సిరిస్ చూడాలి.
హారర్ థ్రిల్లర్స్ కథలకు ఒక కామన్ టెంప్లెట్ వుంటుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో ఓ పెద్ద రాజు కోట. అక్కడ ఆత్మలు.. దెయ్యాలు.. ఇలా సాగుతుంటాయి. ‘అతిథి’ టెంప్లెట్ కూడా ఇదే కానీ దీని సెటప్ మాత్రం కొత్తగా, కాస్త థ్రిల్లింగా అనిపిస్తుంది. ఇందులో కూడా రాజు కోట వుంటుంది. కానీ దిన్ని ట్రీట్ చేసిన విధానం మాత్రం విభిన్నంగా వుంటుంది.
దెయ్యాల మిట్ట అనే ఓ మార్మిక ప్రదేశం గురించి ఆసక్తికరమైన సన్నివేశంతో కథ మొదలౌతుంది. ఆరంభ సన్నివేశాలు రొటీన్ గా అనిపించినప్పటికీ సంధ్య నిలయంలోకి చేరిన తర్వాత ఆసక్తిగా మారుతుంది. సంధ్య నిలయం సెటప్ కొత్తగా అనిపిస్తుంది. రవి వర్మ పరిచయం, అతని భార్య పరిస్థితి, కొత్త కథలు రాయడానికి రవివర్మ ప్రయత్నాలు.. ఇవన్నీ ప్రేక్షకుడి ద్రుష్టిని ఆకర్షిస్తాయి. ఎప్పుడైతే మాయా, సవారి, సంధ్య నిలయంలోకి వస్తారో అక్కడి నుంచి హారర్ థ్రిల్ .. రెండూ ఎలివేట్ అవుతాయి.
మాయా మరణం తర్వాత కథలో అసలు మలుపులు మొదలౌతాయి. అప్పటివరకూ ప్రేక్షకుడు ఊహించని ట్విస్ట్ లు తెరపైకి వచ్చి థ్రిల్ చేస్తాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యలనే అరిషడ్వర్గాల నేపధ్యంలో రాసుకున్న కథ ఇది. ఒక హారర్ కథకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది. దాన్ని చిత్రీకరించి తీరు కూడా బావుటుంది. ఇందులో ఉపకథలుగా వచ్చిన పియానో టీచర్, పని రాక్షసుడు కథలు మొదట కాస్త సాగదీతగా అనిపించినా చివర్లో అరిషడ్వర్గాలతో ముడిపెట్టడం రిజినల్ బుల్ గా వుంటుంది.
ఇలాంటి కథల్లో ట్విస్ట్ బయటపడిన తర్వాత కూడా ప్రేక్షకులని ఎంగేజ్ చేయడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో అతిధి కూడా అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. ఇందలో రాజు కథ మరీ అంత ఆసక్తికరంగా వుండదు. అరిషడ్వర్గాలు గురించి ఆ గతాన్ని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. ఈ కథ తర్కానికి దూరంగా, కాస్త అసంపూర్ణంగా హడావిడిగా ముగించేసినట్లుగా అనిపిస్తుంది. ఐతే ఈ మధ్య కాలంలో వచ్చిన హారర్ థ్రిల్లర్స్ లో ‘అతిథి’ ప్రామెసింగ్ సిరిస్ అనే చెప్పాలి.
ఇలాంటి పాత్ర చేయడం వేణుకి కొత్త. నిజంగానే ఆ పాత్రలో కొత్తగా కనిపించాడు. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సెటిల్డ్ గా చేశారు. ఇలాంటి కథలు అలోచించుకునే వారికి ఇకపై వేణు కూడా మంచి ఆప్షన్ అవుతాడు. మాయ పాత్రలో చేసిన అవంతిక కి కూడా మంచి మార్కులు పడతాయి. రొమాంటిక్ గా భయపెట్టే పాత్రలో సరిగ్గా సరిపోయింది. వెంకటేశ్ కాకుమాను పూర్తి నిడివి వున్న పాత్రలో కనిపించాడు,. ప్రేక్షకులని హారర్ లో ఎంగేజింగ్ గా ఉంచిన పాత్రది. రవి వర్మ పాత్ర కూడా బావుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.,
నేపధ్య సంగీతం బావుంది. చాలా సన్నివేశాలు నేపధ్య సంగీతంతో ఎలివేట్ అయ్యాయి. దాదాపు సన్నివేశాలు ఒక పెద్ద ఇంట్లో జరుగుతాయి. కానీ ఒక ఇంట్లో కథఅంతా జరిగిపోతుందనే ఫీలింగ్ ఐతే కలిగించలేదు. విజువల్స్ హారర్ మూడ్ కి తగ్గట్టు తీశారు. ఆర్ట్ వర్క్ కూడా బావుంది. హారర్ సిరిస్ లలో మాటలకు పెద్ద అవకాశం వుండదు. ఐతే ఇందులో ప్రధాన పాత్ర రచయిత కావడం కారణం ఏమో కానీ చాలా మంచి మాటలు పడ్డాయి. ‘’ గేలానికి చేప చిక్కనంత మాత్రాన చెరువులో చేపలు లేవని కాదు’. ‘యుద్దం వలన ఏమొస్తుంది.. రాబంధులు కూడా విసిగి వదిలేసే శవాలు, ఎండబెట్టటానికి సూర్యుడు కూడా అలిసిపోయే రక్తం తప్పా’’ ఇలాంటి మాటలు చక్కగా కుదిరాయి. మొత్తానికి హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘అతిథి’ మంచి కాలక్షేపమే.