విజయదశమి పండుగ నాటి నుంచి విశాఖ నుంచి పరిపాలన చేస్తానని జగన్ రెడ్డి మరోసారి తన కేబినెట్ సహచరులకు చెప్పారు. దసరా నుంచి విశాఖ నుంచి పాలనకు అందరూ సిద్ధమవ్వాలన్నారు. విశాఖలో రుషికొండ మీద ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇది సీఎం జగన్ కోసం అని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై కోర్టులో కేసులు ఉన్నాయి. అవి టూరిజం భవనాల నిర్మాణమని అధికారులు చెబుతున్నారు.
గతంలో కూడా.. సీఎం జగన్ తాను అక్టోబర్ నుంచే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. కొన్ని కార్యాలయాలను కూడా తలించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆ కమిటీ సూచనల మేరకు కార్యాలయాలను తరలిస్తామని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కార్యాలయాల తరలింపుపై ఇప్పటికే న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. అయితే కార్యాలయాలను కూడా తరలిస్తామని సీఎం జగన్ మంత్రులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో అమరావతి కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కాకుండా… సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ను విశాఖలో పెట్టుకునే అవకాశం ఉంది.
కానీ ఆఫీసుల్ని మాత్రం విసాఖకు తరలించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని సహచరులకు సూచించారు. తాడేపల్లి ఇంటి కోసం కొన్నివందల కోట్ల రూపాయలను వెచ్చించారు. ఎదురుగా ఉన్న కాలనీని తీసేయించారు. ఇప్పుడు పక్కనే ఉన్న అమరారెడ్డి నగర్ అనే కాలనీ సంగతి చూస్తున్నారు. వారంలో ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తాను విశాఖ వెళ్తున్నానని చెబుతున్నారు.