తెలంగాణ కాంగ్రెస్ లో గతంలోలా పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలందర్నీ లైన్లో పెడుతున్నారు. ఎన్నికలకు సంబంధించి కమిటీల్లో ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలవుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీలకు తాజాగా… స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు.. ఇటీవల వారిద్దరూ… అసంతృప్తిగా ఉంటున్నారు. వెంటనే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు. మరో వైపు సీనియర్ నేతలకు టిక్కెట్ పై ఇబ్బంది లేదని చెప్పేందుకు నలభై మంది పేర్లతో ఓ జాబితాను రిలీజ్ చేశారు. తొలి జాబితాగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారని అంటున్నారు. ఇందులో సీనియర్ నేతలందరికీ చోటు దక్కింది. పోటీ ఉన్న చోట పెండింగ్ పెట్టారు. కానీ ఈ జాబితా అధికారికం కాదు.
మరో వైపు బుస్సు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేసింది. పార్టీ ముఖ్య నేతలతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చేపట్టాలని ప్రాథమికంగా తీర్మానించిన నేతలు.. తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ బస్సు యాత్రలో సీనియర్లు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని.. స్థిరమైన పాలన అందిస్తామని ప్రజలకు నమ్మకం కలిగేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్త స్వరాలు తగ్గిపోయాయి. పెద్దగా పార్టీకి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.
రేవంత్ రెడ్డి పూర్తిగా డామినేట్ చేస్తున్నారన్న విమర్శలు, అలకలు ఉన్నప్పటికీ… .ఆయనకు పూర్తిగా చార్జ్ ఇవ్వలేదని… హైకమాండ్ ఆలోచనతోనే అన్నీ జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న సంకేతాలు కూడా గట్టిగా పంపడంతో.. కాంగ్రెస్ లో పరిస్థితి లైన్ లోకి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.