చట్టం, న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం ఏమీ ఉండవు. పాలకుడు ఎవరిపై కక్ష కడితే వాడి అంతం చూడాల్సిందే. ఎవరు నచ్చకపోతే వాడ్ని సాగనంపాల్సిందే. ఎవడు ప్రశ్నిస్తే వాడు ఎందుకు బతికి ఉన్నానురా బాబూ అనుకునేలా చేయాల్సిందే. ఇదంతా ఉత్తరకొరియా పరిస్థితులు కాదు.. అంతకు మించి అన్నట్లుగా ఉన్న ఏపీలో పరిస్థితిలు. మన రాజ్యాంగాలు .. చట్టాలు.. వ్యవస్థలు అన్నీ పాలకుడికి వంత పాడాల్సిందే. అది నంది కాదు పంది అంటే.. అందరూ పంది అనాల్సిందే. ఎదురుగా ఉన్నది నంది అని చెప్పే ధైర్యం ఏ ఒక్క వ్యవస్థకీ ఉండదు. అలా చెప్పకుండా ఉండటానికి సామ బేద, దాన దండోపాయాలను ప్రయోగించేసిన అంతా స్క్రీన్ ప్లే రెడీ చేసిన తర్వాతనే .. అది నంది కాదు పంది అనే డ్రామాను స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లో స్కామ్ పేరుతో ఏపీలో జరుగుతున్న డ్రామా చూస్తే ఎవరికైనా.. మన వ్యవస్థలు ఇంత బలహీనమా అని భయానికి గురవుతారు. ఎందుకంటే.. కళ్ల ముందు నిజాలన్నీ ఉన్నాయి. కానీ పాలకుడు.. పాక్షిక నిజాల్ని మాత్రమే బయటపెడుతున్నాడు. ఓ మెయిల్ వస్తే.. ఆ మెయిల్ మొత్తం కాకుండా సగం మెయిల్ కట్ చేసి చూపిస్తున్నాడు. కానీ మిగతా సగం మెయిల్ ఏది అని ఎవరూ అడగడం లేదు. చెప్పిందే చెప్పి.. చెప్పిందే చెప్పి.. అబద్దాన్ని నిజం చేసి ఓ వ్యక్తిని అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో అన్ని వ్యవస్థలూ భాగమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తే..చట్టం, న్యాయం అందరికీ ఒక్కటేనని అనుకునేవారి కడుపు మండిపోతుంది. నా దేశం ఎందుకు ఇలా అయిందని అనుకుంటాడు. పక్కనే ఉన్న పాకిస్తాన్ లో అచ్చంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అధికారం కోల్పోయిన ఏ నేత అయినా బతికి బట్టకట్టాలంటే చాలా కష్టపడాలి. అయితే జైల్లో ఉండాలి..లేకపోతే విదేశాలకు పరారు కావాలి. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం నియంతృత్వమే !
తప్పు చేస్తే ఆధారాలు చూపించి అరెస్ట్ చేయడం అనేది పోలీసుల మొదటి పని. సామాన్యులకైనా అదే చేయాలి. కానీ ఏపీలో ఏం జరుగుతోంది. ఎప్పుడో రెండేళ్ల కిందట నమోదు చేసిన కేసులో ఎఫ్ఆఆర్లో కూడా పేరు లేని కేసులో… పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా.. పదహాహారేళ్లు ప్రతిపక్ష నేతగా ఉంటూ… వచ్చే ఎన్నికల కోసం తన ప్రజాస్వామ్య హక్కులను వినియోగించకుంటూ ప్రజల్లోకి వెళ్తున్న నేతను అడ్డగోలుగా అరెస్ట్ చేసేశారు. ఓ ఎఫ్ఐఆర్ లేదు.. ఏ తప్పు చేశారో ఓ ఆధారం లేదు. కానీ అరెస్ట్ చేశారు. 73 ఏళ్ల వయసు ఉన్న ఆయనను 48 గంటల పాటు నిద్రపోనివ్వకుండా తిప్పారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు అన్నీ చివరి క్షణాల్లోనే ఇచ్చారు. ఆ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం పబ్లిక్ డోమైన్లో ఉంది. చంద్రబాబు అవినీతి చేశారన్న దానికి సాక్ష్యాలు లేవని సీఐడీ ప్రకటించింది. అదో టాక్స్ కేసని..అందులో ఎలాంటి అవకతవకలు లేవని.. అప్పటికే ఓ సారి గౌరవనీయ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అయినా సరే చంద్రబాబును జైల్లో పెట్టారు. అసలు ఆయన చేసిన తప్పేమిటో.. కోర్టులకూ సీఐడీ సరిగ్గా చెప్పలేకపోయింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో జరిగిన వాదనల్లో సబ్ కాంట్రాక్టులకు ఇచ్చి నిధులు మళ్లించారని వాదించారు. అప్పుడు న్యాయమూర్తి.. పిటిషనర్‌కు అంటే చంద్రబాబుకు… ఆ సబ్ కాంట్రాక్టర్లకు సంబంధం ఏమిటి అంటే.. కనీసం స్పందించలేకపోయారు. ఆ వాదనలు విన్న ఎవరికైనా.. ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించి… జైల్లో పెట్టారని అర్థం అయిపోతుంది. షెల్ కంపెనీల పేరుతో కథలు చెప్పి.. షెల్ కేసు పెట్టారన్న మాట.
తప్పుడు ప్రచారమే టార్గెట్ – హక్కులు కాపాడలేకపోతున్న వ్యవస్థలు
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంంబధించి ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. అవి పబ్లిక్ డొమైన్లో కూడా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం మొదట చెబుతున్న ఆరోపణ నిధుల దుర్వినియోగం. ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులకు సంబంధించి మొత్తం… పరికరాలు, సాఫ్ట్ వేర్ అందాయని ఈ ప్రభుత్వమై సర్టిఫై చేసింది. ఇక నిధుల దుర్వినియోగం ఎక్కడ ? . ఇక ఈ స్కిల్ ప్రాజెక్టు ఎంపికలోనే అవకతవకలు జరిగాయన్నారు. ఏం అవకవతకలో చెప్పడం లేదు. నిజంగా అవకతవకలు జరిగితే.. దానికి బాధ్యులెవరు ? నేరుగా ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతారా ?. స్కిల్ డెలవప్మెంట్ ప్రోగ్రాం మొత్తం కార్పొరేషన్ పేరు మీద నడిచింది. దీనికి ప్రేమచంద్రారెడ్డి అనే ఐఏఎస్ చైర్మన్. ఈ వ్యవహారంలో కనీసం పది మంది ఐఏఎస్‌లు పాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా నడిపింది వారు.. చంద్రబాబు రోజు వారీ వ్యవహారాలను చూసుకుంటారా ?. పాలనా వ్యవస్థపై.. మన రాజ్యాంగంపై… చట్టాలపై ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా.. ఈ కేసులో తప్పంటూ జరిగితే అది ఎవరిదో ముందుగానే అర్థం చేసుకుంటారు. కానీ వందల కోట్లు పెట్టి నీలి, కూలి , సోషల్ మీడియాను పోషిస్తున్న నయా నియంత పాలకులు.. తాము చెప్పేది మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో అసలు విషయాల జోలికి వెళ్లడం లేదు. కోర్టులో వాదనలు వినిపించకుండా దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి… చంద్రబాబు ప్రధాన నిందితుడని ప్రచారం చేస్తున్నారు.. ఎలా అనేది్ మాత్రం చెప్పడంలేదు. బయట జర్నలిస్టులకు వస్తున్న సందేహాలు.. హక్కులు కాపాడాల్సిన వ్యవస్థలుక రావడం లేదు. ఓ మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలపై ఎలా విచారణ చేస్తారు…ఎలా ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేస్తారన్న డౌట్స్ రానీయడం లేదు. మొదట సిమెన్స్ కు సంబంధం లేదన్నారు.. అసలు కేబినెట్ ఆమోదంలేదన్నారు.. అసలు స్కిల్ సెంటర్లు లేవన్నారు… ఇలా అడ్డగోలు అబద్దాలు చెబుతూ పోతున్నారు. కానీ నిజాలన్నీ కళ్ల ముందే ఉన్నాయి. వ్యవస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదు ?
అసలు ముఖ్యమంత్రి నేరుగా ఎలా బాధ్యుడు.. చిన్న ఆధారం లేకుండా జైల్లో పెడతారా ?
ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి కక్ష సాధింపులు ఉంటాయన్న ఉద్దేశంతోనే 17A సెక్షన్ ను తీసుకు వచ్చారు. విపక్ష పార్టీలపై కక్ష సాధింపుల నుంచి పరిపాలించిన నేతలకు రక్షణ ఇస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వం కాకుండా.. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై విచారణకు ఆదేశిస్తే.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా అన్నది కూడా చూడలేదు. నిజానికి అక్కడ .. యడ్యూరప్ప కుమారుడు క్విడ్ ప్రో కో ద్వారా లాభం పొందారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక్కడ ఒక్క రూపాయి మనీ ట్రైల్ లేదు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి ఒక్క రూపాయికీ డిజైన్ టెక్ సంస్థ ఖర్చుల లెక్కలు చెప్పింది. కళ్ల ఎదుట రెండున్నర లక్షల మందిట్రైనింగ్ పొందిన వారు ఉన్నారు. ప్రభుత్వం దగ్గర నాలుగు వందల కాలేజీల్లో ఏర్పాటు చేసిన సాప్ట్ వేర్, హార్డ్ వేర్ స్టాక్ ఉంది. అంతా కళ్ల ముందే ఉంది. మరి అవినీతి ఎక్కడ జరిగింది. సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్.. మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్పారు. ఆయన చెప్పింది అబద్దమైతే.. దర్యాప్తు సంస్థలు వెంటనే నిజాలు ఎందుకు బయట పెట్టలేదు. పీవీ రమేష్ తన స్టేట్మెంట్ ను తప్పుగా నమోదు చేశారని ప్రకటన ఇస్తే సీఐడీ వెంటనే ఎందుకు స్పందించింది..? సుమన్ బోస్ అంశంపై ఎందుకు స్పందించలేదు ?
వ్యవస్థలపై సామాన్యుడు నమ్మకం కోల్పోతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు ?
ఓ సామాన్యుడు కూడా ధైర్యంగా బతకగలిగే పాలనా వ్యవస్థ ఉండటమే అసలైన ప్రజాస్వమ్యం. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థంలేదు. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్లు అడ్డగోలుగా తిరుగుతున్నరు. రాజకీయ సమవేశాలు పెట్టి అంతు చూస్తామని హెచ్చరిస్తున్నరు. సొంత కుటుంబసభ్యుడ్ని అత్యంత కిరాతకంగా నరికి పోగులు పెట్టి.. గుండె పోటు అని ప్రచారం చేశారు. సాక్ష్యాలన్నీ తుడిచేశారు. ఈ కేసులో నిందితులెవరో చెప్పడానికి అపరాధ పరిశోధనలోపండిపోవాల్సిన పని లేదు. చిన్న వెంట్రుక దొరికితే ఇలాంటి హత్య కేసుల్ని వారం రోజుల్లో చేధించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్లు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కశ్మీర్ ఉగ్రవాదుల మాదిరి ఆస్పత్రిలో దాక్కుని.. కోర్టులో రిలీఫ్ తెచ్చుకోగలిగారు. కానీ ఏ ఆధారాలు లేని.. అసలు స్కామే జరగలేదని.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తోందని కళ్లముందు కనిపిస్తున్న కేసులో… ఓ మాజీ ముఖ్యమంత్రి.. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత జైలు పాలయ్యాడు. మరి వ్యవస్థలన్నీ సామాన్యుడికి భరోసా ఇస్తున్నట్లేనా ?. మనది ఉత్తర కొరియా కాదు. కిమ్ ఏం చెబితే అది అక్కడ రాజ్యాంగం.. కానీ ఇక్కడ మాత్రం మనది ప్రజాస్వామ్యం. పాలకుడు ఏది చెబితే అది కాదు.. ఏదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి.. అదే ప్రజాస్వామ్యం. లేకపోతే కొరియా కన్నా దుర్బర పరిస్థితుల్లోకి వెళ్లినట్లే. ఇప్పుడు ఏపీకి అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఇష్టం లేని వాళ్లను.. అడ్డొచ్చే వాళ్లను జైల్లో పెట్టుకునేదానికి మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవాలా ?
ఓ తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించడానికి వైసీపీ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు కార్పొరేట్ సర్కిల్స్ లో ఎలా మాట్లాడుకుంటున్నారో వారికి బాగా తెలుసు. ఓ ఎమ్మెన్సీ కంపెనీ మాజీ ఎండీకి చంద్రబాబు పేరు చెప్పాలని రూ. పాతిక కోట్లు ఆపర్ చేశారు.. ఆయన కాదన్నారని జైల్లో ఆయన పక్కన శవాన్ని పెట్టి టార్చర్ చేశారు. ఇలాంటివి సామాన్యులు ఎవరైనా ఊహించగలరా ?. ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి పాలన ఉత్తర కొరియాలో ఆయనా ఉంటుందని ఊహించలేం. కానీ మన కళ్ల ముందు జరిగింది. ఎన్నికలకు ముందు ఒక దాని తర్వాత ఒకటి వరుసుగా కేసులు పెట్టి ఓ ప్రతిపక్ష నేతను సుదీర్ఘ కాలం జైల్లో ఉంచి.. 73 ఏళ్ల వయసులో ఆయనకు కనీస సౌకర్యాలు అందకుండా చేసి ప్రాణానికి హాని తలపెట్టాలనే ప్రయత్నం కళ్ల ముందే ఉంది. ఆయన ప్రజల్లోకి వెళ్లిన ప్రతీ సారి రాళ్ల దాడులు చేశారు. ఈ రాళ్ల దాడిలో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఆయన బద్రత తీసేస్తే ఫినిష్ అని స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం లాంటి వాళ్లు హెచ్చరించారు. డెంగీ లాంటి రోగాల బారిన పడేలా.. రాజమండ్రి జైల్లో కుట్రలు పన్నుతున్నారని చెబుతూనే ఉన్నారు. నిండా ఇరవై ఏళ్లు నిండని ఓ కుర్రాడు.. రాజమండ్రి జైల్లో డెంగీ సోకి చచ్చిపోయాడు. అలాంటి చోట.. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఎలా ఉంటుంది ?. తనకు న్యాయం కావాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే దానిపై విచారణ రెండు వారాలు సాగుతూనే ఉంది. ఇది మాజీ ముఖ్యమంత్రికి వచ్చిన కష్టం.. ఆయన కోసం ప్రజలు ఉన్నారు కాబట్టి జరుగుతున్న చర్చ. మరి సామాన్యుడికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు పట్టించుకుంటారు ? కోడి కత్తి కేసు నిందితుడు ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు ? ఇలాంటి అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. అందుకే… మన రాష్ట్రం ఇప్పటికే ఉత్తరకొరియాను దాటేసింది. పూర్తిగా కొత్త చట్టం.. కొత్త రాజ్యాంగంలో నడుస్తోంది. ఈ నరకం నుంచి ప్రజలకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో అప్పుడే ప్రజాస్వామ్యం మళ్లీ బతికినట్లుగా భావించాల్సి ఉంటుంది. అప్పటి వరకూ బితుకుబితుకుమంటూ బతకాల్సిందే.