దసరాకు విశాఖ నుంచి పరిపాలన చేస్తామని అందరూ సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీలో మంత్రి వర్గ సహచరులకు చెప్పారు. ఓ కమిటీ వేసి ఆఫీసుల్ని తరలిస్తామని కూడా చెప్పారు. బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. కానీ వైసీపీ విశాఖ ఇంచార్జ్ వైవీ సబ్బారెడ్డి మాత్రం కార్యాలయాలు చూస్తున్నామని ప్రకటించారు. జగన్ రెడ్డి కావాలంటే విశాఖలో కాపురం పెట్టుకోవచ్చని.. కానీ కార్యాలయాలను తరలించే అవకాశం మాత్రం లేదు.
రుషికొండకు బోడిగుండ కొట్టించి ఇల్లు రెడీ చేశారు. అందులో ఆయన ఉండొచ్చు. కానీ ఇతర ఆఫీసులు ఒక్క దాన్ని తరలించలేరు . అమరావతి రాజధాని కోసం రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాలను ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం లేదని రిట్ ఆఫ్ మాండమస్ విధించింది.
ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. వ్యక్తిగతంగా సీఎం విశాఖ వెళ్లి క్యాంప్ ఆఫీస్ పెట్టకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ కార్యాలయాలు తరలించడం మాత్రం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కోర్టు తీర్పు మా వాళ్లకి ఈకతో సమానం అని వైసీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఏమైనా చేస్తామని ఇప్పటి వరకూ ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నిస్తూ ఉంటారు. మరి ఏం చేయబోతున్నారో వేచిచూడాలి.