తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల నేతలు పొత్తుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించం లేదు. బీఆర్ఎస్తో పొత్తు ఖాయం అని..కనీసం రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు అయినా కేసీఆర్ కేటాయిస్తారని ఆశపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల్లో తమ మద్దతుతోనే గట్టెక్కారన్న కృతజ్ఞత చూపిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం రాజకీయాల్లో అలాంటివేమీ వర్కవుట్ కావని జాబితా ప్రకటనతో స్పష్టం చేశారు.
దీంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ పార్టీతో చర్చలు జరిపారు. పొత్తు కోసం కొంత మంది ఓకే అని.. మరికొందరు కాదని వాదించారు. నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరి ధిలోని 9 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు మంచి ఓటు బ్యాంక్ ఉందని.. పొత్తులు పెట్టుకుంటే ప్రయోజనమేనని మరికొందరు వాదిస్తున్నారు. రానీ పొత్తు వల్ల కాంగ్రెస్ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే పార్టీకి నష్టమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొ త్తు కుదిరితే మాత్రం దాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. కమ్యూనిస్టు నేతలు.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతోనూ సమావేశం అయ్యారు. కానీ ఎలాంటి ఫలితమూ రాలేదు.
దీంతో రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బతిమాలినంత పని చేసింది. కానీ బీజేపీని ఓడించేది బీఆర్ఎస్సే అంటూ కాంగ్రెస్ ను దూరం పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని కాంగ్రెస్ వైపుకు చేరుతున్నారు. వారు ఆదరించడానికి వెనుకడుగు వేస్తున్నారు.