Sapta Sagaralu Dhaati Movie Telugu Review
రేటింగ్: 2.5/5
ఈమధ్య కన్నడ చిత్రసీమలో బాగా వినిపించిన పేరు… ‘సప్త సాగర దాచే ఎల్లో’. ఈ సినిమా ఓ ప్రేమ కావ్యమని అక్కడి రివ్యూలు తేల్చేశాయి. ప్రేక్షకులూ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కన్నడ వెర్షన్ చూసిన కొంతమంది తెలుగు దర్శకులు,రచయితలు.. ఈ సినిమాని తెగ మోస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాని ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమాకి వచ్చిన ముందస్తు హైప్ వల్ల, చార్లి 777 లాంటి మంచి సినిమాలో నటించిన రక్షిత్ శెట్టి ఇమేజ్ వల్ల.. ‘సప్త సాగరాలు దాటి’ చూడాలన్న కుతూహలం తెలుగు ప్రేక్షకులకూ కలిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కన్నడలో వచ్చినంత క్రేజ్, మనవాళ్లు ఇచ్చినంత క్రేజ్ ఈ సినిమాకి ఉన్నాయా, లేదా?
మను(రక్షిత్ శెట్టి) ప్రియ (రుక్మిణీ వసంత్) ఇద్దరూ ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకొంటారు. మను అనాథ. ఓ గొప్పింట్లో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ప్రియ కి పాటలు పాడడం అంటే ఇష్టం. తను సింగర్ కావాలని కలలు కంటుంటుంది. మను, ప్రియ.. ఇద్దరూ పెళ్లి చేసుకొని తమదైన ఇంట్లో సెటిల్ అవ్వాలని ఆశ పడుతుంటారు. కానీ.. డబ్బులే సరిపోవు. బాగా డబ్బులు సంపాదించి, ప్రియని బాగా చూసుకోవాలని మను తహతహలాడుతుంటాడు. ప్రియకి సముద్రం అంటే చాలా ఇష్టం. అందుకే సముద్రం పక్కన ఓ ఇల్లు కట్టుకోవాలని మను భావిస్తాడు. అందుకు చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బుల కోసమే, చేయని తప్పు తనపై వేసుకొని జైలు కెళ్తాడు మను. జైల్లో ఏమైంది? మను చేసిన తప్పేంటి? జైలు నుంచి తిరిగొచ్చాడా, లేదా? జైల్లో మను, బయట ప్రియ పడిన వేదన ఎలాంటిది..? ఇదే మిగిలిన కథ.
ఈ కథలో ప్రేమ ఉంది. ప్రేమ కంటే ఎక్కువ పెయిన్ ఉంది. విషాదం నిండిన ప్రేమకథలు చూసేవాళ్లకు… `సప్త సాగరాలు దాటి` తప్పకుండా నచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్కటే కండీషన్. ఈ సినిమా చాలా స్లో పేజ్‌లో నడుస్తుంటుంది. మను, ప్రియ పాత్రల్ని, వారి కలల్ని పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆ సన్నివేశాలన్నీ చాలా నిదానంగా సాగుతాయి. కార్ యాక్సిడెంట్, ఆ తరవాత చేయని తప్పు ఒప్పుకొని మను జైలుకి వెళ్లడం దగ్గర్నుంచి కథనంలో కాస్త ఊపొస్తుంది. ఆ జైలు వాతావరణం, అక్కడ మను పడే కష్టాలు ఇవన్నీ రియలిస్టిక్ గా తీశారు. ప్రేమ కథ కాస్త.. క్రమంగా జైలు కథ అయిపోతుంది. జైల్లో రాజకీయాలు, అక్కడి ముఠా తగాదాలు.. మను క్రమంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం అలా.. అలా ఈ కథలో గాఢత వ్యాపిస్తుంది.
దర్శకుడు ఈ కథని కవితాత్మక ధోరణిలో చెప్పాలనుకొన్నాడు. అతని ఈస్తటిక్ సెన్స్ ఆకట్టుకొంటాయి. అయితే.. ఫాస్ట్ ఫేజ్‌లో సినిమాని చూడ్డానికి ఇష్టపడే ఈ తరానికి.. అదంతా ఓ చాదస్తంలా ఉంటుంది. టేప్ రికార్డ్‌లో ప్రియ గొంతు వినడానికి జైల్లో.. మను పడే తాపత్రయం చూపించే సన్నివేశం కోసం దర్శకుడు దాదాపు 5 నిమిషాలు సమయం తీసుకొన్నాడు. అదంతా భరిస్తే.. హీరో క్యారెక్టర్ లో ఉండే పెయిన్ ప్రేక్షకుడికి అర్థమవుతుంది. లేదంటే.. అవవసరమైన సాగదీతలా అనిపిస్తుంది. ఇదొక్కటే కాదు. చాలా సన్నివేశాలు అలానే కనిపిస్తాయి. హీరో హీరోయిన్ల ప్రేమలో కాన్ప్లిక్ట్ సహజంగా రాలేదు. హీరో తీసుకొన్న ఓ అనాలోచిత నిర్ణయం వల్ల.. అగాథం ఏర్పడింది. దాంతో ఓ దశలో హీరోపై కూడా ప్రేక్షకులకు కోపం వస్తుంటుంది. కథానాయిక పాత్ర పడే వేదన… మనుని బయటకు తీసుకురావడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు గుండెని తాకుతాయి. ఈ సినిమాలో కట్టి పడేసే విషయం ఏదైనా ఉందంటే… కచ్చితంగా ప్రియ పాత్రే. జైల్లో ఉండే నెగిటీవ్ క్యారెక్టర్లు రొటీన్‌గానే ఉన్నా – హీరో పాత్రపై సింపతీ ఏర్పడడానికి అదో కారణం అవుతాయి.
ఈ కథని సైడ్ ఏ, సైడ్ బీ అనే రెండు భాగాలుగా విడగొట్టారు. ప్రేమకథని ఇలా రెండు భాగాలు చేయడం ఇదే ప్రధమం. క్లైమాక్స్‌లో సైడ్ బీ లో ఏం జరుగుతుందో గ్లింప్స్‌లా చూపించారు. ఆ కాస్త సమయంలోనే సైడ్ బి చూడాలన్న కుతూహలం ఏర్పడుతుంది. అయితే.. ఆ రెండు భాగాల్నీ ఒకే సినిమాగా మలిస్తే.. కథనంలో వేగం వచ్చేది. ఓ పరిపూర్ణమైన కథని చూసిన ఫీలింగ్ కలిగేది.
హీరోగా రక్షిత్ శెట్టి, హీరోయిన్‌గా రుక్మిణిల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా రుక్మిణి చాలా సహజంగా చేసింది. సినిమా చూస్తున్నంత సేపూ ఆ పాత్రతో ప్రేమలో పడిపోతాం. రక్షిత్ శెట్టి మరోసారి ఆక్టటుకొన్నాడు. ఇలాంటి పాత్ర చేయడం నిజంగానే ఛాలెంజ్. దాన్ని రక్షిత్ స్వీకరించాడు. జైల్లో నెగిటీవ్ పాత్రలో కనిపించిన నటుడు ఆకట్టుకొన్నాడు. తనని చూస్తే ఓరకమైన భయం, ద్వేషం కలుగుతుంటాయి. పవిత్ర లోకేష్ ఓ కీలక పాత్రలో కనిపించింది.
టెక్నికల్‌గా సినిమా బాగుంది. కెమెరా వర్క్ ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం మ్యాజిక్ చేస్తుంటుంది. కథలోని పెయిన్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లోనూ వినిపించాడు. వెలుగు చీకట్లని జైలు జీవితానికీ, స్వేచ్ఛకూ సింబాలిక్‌గా చూపించారు. సముద్రం గురించీ, జైలు జీవితం గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకొంటాయి. దర్శకుడు ఈ కథకి కవితాత్మకంగా చెప్పాలని భావించాడు. ఏ ఒక్క డిటైలింగ్ నీ వదల్లేదు. దాని వల్ల సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. పెయిన్ ఫుల్ స్టోరీల్ని చూడ్డానికి ఇష్టపడేవాళ్లు, స్లో ఫేజ్ ఉన్నా ఫర్లుదు భరించగలం అనేంత ఓపిక ఉన్నవాళ్లూ ఈ సినిమాని చూడొచ్చు. కన్నడలో క్లాసిక్ అయ్యింది కదా అని భారీ అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం… కష్టం.
రేటింగ్: 2.5/5