చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. రెండు రోజులు రాజమండ్రి జైల్లోనే ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేయనున్నారు. విచారణ సమయంలో చంద్రబాబు తరపు లాయర్లు ఒకరిద్దరు అందుబాటులో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. విచారణ జరిపే అధికారుల పేర్లు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. అలాగే విచారణను రికార్డు చేయాలన్నారు.
ఆ వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలన్నారు. విచారణ సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని స్పష్టం చేశారు. చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ ను సోమవారం చేస్తామని జడ్జి తెలిపారు. కస్టడీ పిటిషన్ పై ఇంతకు ముందే విచారణ పూర్తి చేశారు. కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రాకపోవడంతో మూడు, నాలుగు సార్లు వాయిదా వేశారు. హైకోర్టులో తీర్పు రాగానే ఏసీబీ కోర్టు కూడా రెండు రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించారు. అంతకు ముందు హైకోర్టు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపు లాయర్లు 17A సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. అయితే తీర్పులో ఆ చట్టం ప్రస్తావన ఎక్కడా తీసుకు రాలేదు. చట్టం వర్తింపుపై తీర్పులో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సాక్ష్యాలను పరిశీలించామని.. విచారణను ఈ దశలో ఆపలేమని తెలిపింది.
మరో వైపు అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామే లేదని.. అందులో చంద్రబాబు ప్రమేయం లేదని .. గట్టిగా నమ్ముతున్న టీడీపీ లాయర్లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. లోకేష్ ఇప్పటికే ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. శనివారం కూడా హైకోర్టుకు పని దినమే. అయితే శనివారం పిటిషన్ వేస్తారా.. సోమవారమా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.