ఓ అధికార పార్టీ నుంచి టిక్కెట్లు ఇచ్చినా సరే నేతలు వేరే పార్టీలో చేరిపోతున్నారంటే ఆ పార్టీకి ఊహించనంత గడ్డు పరిస్థితి ఉన్నట్లే. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టిక్కెట్ ప్రకటించినప్పటికీ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. తన కుమారుడికీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన కారణం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రెండు టిక్కెట్ల ఆఫర్ లభించడంతో ఆ పార్టీలో చేరే అవకాశాల ఉన్నాయి.
మైనంపల్లి బలమైన నేత కావడంతో ఆయనను పార్టీలో ఉంచేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నించింది. రెండు సీట్లు ఇవ్వడం కుదరదు కానీ… ప్రాధాన్య ఇస్తామని హామీ ఇచ్చింది. ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి బాధ్యత తీసకుంటామని కూడా చెప్పింది. దీనిపై చాలా రోజులు ఆలోచించిన మైనంపల్లి హన్మంతరావు… బీఆర్ఎస్‌లో తనకు భవిష్యత్ ఉండదని డిసైడయ్యారు. శుక్రవారం రాత్రి బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లుగా వీడియో విడుదల చేశారు.
ఏ పార్టీలో చేరాలో అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. కానీ ఇప్పటికే ఆయన కాంగ్రెస్ తో చర్చలు పూర్తి చేశారని రెండు టిక్కెట్లు కన్ఫర్మ్ చేసుకున్నారని.. అందుకే రాజీనామా చేశారని అంటున్నారు. మైనంపల్లి రాజీనామా అంశం… బీఆర్ఎస్ పార్టీకి నైతికంగా ఇబ్బంది పెట్టేదే. తమది గెలిచే పార్టీ అని సొంత ఎమ్మెల్యేలు నమ్మడం లేదన్న అభిప్రాయం బలపడటానికి అవకాశం ఏర్పడుతుంది.