బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల సన్నాహాలు ఎలా ఉంటాయి అంటే.. భారీ బడ్జెట్ సినిమాను తలదన్నేలా ఉంటాయి. 2018లో అసెంబ్లీని రద్దు చేయడానికి ముందే హైదరాబాద్ లో పది లక్షల మందితో బహిరంగసభ నిర్వహించారు. తర్వాత అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తర్వాతి రోజు నుంచి కేసీఆర్ కూడా రంగంలోకి దిగిపోయారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అభ్యర్థుల్నిప్రకటించి నెల దాటిపోయింది . ఆ అభ్యర్థులు ప్రభుత్వ పథకాల చెక్కులు పంచండం తప్ప జనాల్లోకి పోవట్లేదు. కేసీఆర్ కూడా ఇంకా రెడీ కాలేదు. కేటీఆర్ చాలా కాలం విదేశాల్లో ఉండి ఇటీవలే వచ్చారు. పైగా ఆయన ఎన్నికలు ఆలస్యం కావొచ్చంటూ వ్యాఖ్యానించి నేతలు మరింత లైట్ తీసుకునేలా చేశారు.
ఎన్నికలకు ఇంకా దాదాపుగా నాలుగు నెలలు ఉండగానే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించి కేసీఆర్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. దాంతో జనం వద్దకు వెళ్లేందుకు, ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసేందుకు కావాల్సినంత సమయముందని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. తద్వారా ప్రతిపక్షాలపై పైచేయి తమదేనని అంచనా వేశాయి. జాబితాను విడుదల చేసి నెల అవుతున్నా గులాబీ పార్టీలో మాత్రం ఆ జోష్ కానరావటం లేదు. తొలి జాబితా తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తారని అందరూ అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఒకట్రెండు సందర్భాల్లో తప్ప సీఎం జిల్లాలకు వెళ్లిన దాఖలాల్లేవు.
క్షేత్రస్థాయిలోని ఎమ్మెల్యేలు కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్ల పంపిణీ, ఎక్స్గ్రేషియోలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ తదితర ప్రభుత్వ అధికారిక వేదికల మీది నుంచే రాజకీయ విమర్శలు చేయగలుగుతున్నారు తప్పితే స్పష్టంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొనడం లేదు. టిక్కెట్ దక్కిందని మురిసిపోతున్న వారెవ్వరికీ బీ-ఫామ్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవటమే అసలు సిసలు కారణమని చెబుతున్నారు. ప్పటి నుంచే తొందరపడకుండా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, బీ-ఫామ్ చేతికందిన తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.