మంచు వారి మంచి నటుడు మంచు మనోజ్ పవర్ ఫుల్ ఎనర్జీ ఉన్న హీరో. మాస్, యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా ఏ పాత్ర అయినా సునాయాసంగా చేసేయగల నటుడు మంచు మనోజ్. సంతోషం చిత్రం తో మంచి ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దశరధ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘శౌర్య’, ఒక ప్రేమకథకి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ని మిక్స్ చేసినా ఈ సినిమాలో రెజీన కసాండ్ర హీరోయిన్. మరి ‘సూర్య vs సూర్య’ తర్వాత మల్కాపురం శివకుమార్ నిర్మించిన సరికొత్త థ్రిల్లర్ ఎంత వరకూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసింది అనేది చూద్దాం..
కథ :
ఈ చిత్రం పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పటినుండి .. ‘జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి.. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగేది’ అనే కాన్సెప్ట్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఇక కథ విషయానికొస్తే… శౌర్య (మంచు మనోజ్) తను ప్రేమించిన నేత్ర (రెజీనా) తో కలిసి యు.కె వెళ్లడం కోసం తనకు వచ్చిన మంచి బిజినెస్ ఆఫర్ ని కూడా వదిలిలేసుకుంటాడు. కానీ ఎప్పటిలానే పెద్దల నుంచి సమస్య రావడంతో పారిపోవాలని డిసైడ్ అయ్యి, దేశం వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్లి పోవడానికి ఒక్క రోజు గ్యాప్ ఉండటంతో నేత్రతో కలిసి ఆమెకు ఎంతో ఇష్టమైన కోటిలింగాల గుడిలో మహా శివరాత్రి సందర్భంగా జాగారం చేయడానికి అంగీకరిస్తాడు శౌర్య. అర్ధరాత్రి తర్వాత శౌర్య పక్కనే నిద్రలో ఉన్న నేత్రని చంపడానికి అటాక్ జరుగుతుంది. చావు బ్రతుకల మధ్య ఉన్న నేత్రను ఆంబులెన్స్ లో హాస్పటల్ కి తీసుకెళతారు. నేత్రను శౌర్య హత్య చేసాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేత్ర తండ్రి ఎం.పి కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. కేసును కృష్ణప్రసాద్ (ప్రకాష్ రాజ్) హ్యాండిల్ చేస్తాడు. నేత్రకు బంధువైన కృష్ణప్రసాద్ కేసును పరిశీలించి శౌర్య ఈ హత్య చేయలేదని నమ్ముతాడు. కోర్టులో శౌర్యను హాజరుపర్చుతాడు. కట్ చేస్తే…కోర్టులో తనే నేత్రను గొంతు కోసి చంపేసానని జడ్జి ముందు చెబుతాడు శౌర్య. ఇది కృష్ణప్రసాద్ తో పాటు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. హాస్పటల్లో ఉన్న నేత్ర 365 అని పేపర్ మీద రాసి చనిపోతుంది. అసలు నేత్రను శౌర్య ఏ చంపాడా? .. నిజంగానే నేత్ర చనిపోయిందా… శౌర్య ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడు… నేత్ర రాసిన 365 అంకె వెనుక ఉన్నరహస్యం ఏంటీ… అసలు శౌర్య ఎందుకు ఇదంతా చేసాడు అనేదే ఈ చిత్ర కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్ :
ఇక నటీనటుల విషయానికి వస్తే…ఇప్పటివరకూ చూసిన మనోజ్ వేరు.. ఈ సినిమాలో కనిపించిన మనోజ్ వేరు అన్నట్లుగా శౌర్య పాత్ర ఉంది. మంచు మనోజ్ చూడటానికి బాగా బొద్దుగా, తొలుత అమాయకుడిగా కనిపిస్తాడు. ఇంటర్వెల్ లో తనలోని ఇంకో షెడ్ కూడా వుందని రివీల్ చేసే సీన్ లో మనోజ్ పెర్ఫార్మన్స్ సూపర్ గా వుంటుంది.తను ఎంచుకున్న పాత్రకి పూర్తి గా న్యాయం చేసాడు. రెజీన ఈ సినిమాలో గ్లామర్ అనేది లేకుండా, చాలా హోమ్లీ లుక్ లో కనిపిస్తుంది. అలాగే నటనకు ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర కావడంతో తన నటనతో కథకి న్యాయం చేసింది. ఇక సినిమాలో కీలక పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా అన్ని షేడ్స్ ని పర్ఫెక్ట్ గా చేసాడు. మిగతా పాత్రలలో సాయాజీ షిండే, నాగినీడు, సుబ్బరాజులు తమ నటనతో సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రభాస్ శ్రీను ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా నవ్వించాడు.
సాంకేతిక వర్గం:
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీసిన దశరధ్ ఈ చిత్రాన్ని కూడా ఆ పంథాలో నడిపించినా, కొత్తగా థ్రిల్లింగ్ ఎలిమెంట్ యాడ్ చేసి ఈ సినిమా తీశాడు. రచనా సహకారం అందించిన గోపి మోహన్ కూడా సినిమాని పెద్ద బెటర్ ప్రాజెక్ట్ గా మార్చలేకపోయాడు. ఇక కిషోర్ గోపు రాసిన స్క్రీన్ ప్లే అయితే మరీ బోరింగ్ అండ్ స్లో గా నత్త నడకలా ఉండడంతో అక్కడక్కడా బోర్ ఫీల్ అవుతాము. మల్హర్ భట్ జోషి అందించిన విజువల్స్ సినిమాకి తగ్గట్టుగానే డీసెంట్ గా ఉన్నాయి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కె. వేదకి మొదటి సినిమా అయినా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు రెండు బాగుంటే, మిగతావి అంత క్యాచీగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి కాసింత హెల్ప్ అయ్యింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఇచ్చిన మ్యూజిక్ బిట్స్ బాగున్నాయి. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ స్టార్టింగ్ లో బోర్ అనిపించినా, సినిమా ఎండ్ లో బాగానే వుంది. ఆర్ట్ వర్క్ ఓ కె., మల్కాపురం శివకుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
మంచు మనోజ్ , దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లింగ్ లవ్ స్టొరీ ‘శౌర్య’ సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని చివర్లో తన థ్రిల్స్ తో మెప్పించింది. ఈ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా వున్నా, స్ర్కీన్ ప్లే ఇంకా బలంగా ఉండి ఉంటే సినిమాకు పట్టు వుండేది . ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే ఆసక్తి కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగుతూ, ఇక సెకండాఫ్ లో చివరి గా వచ్చే 30 నిమిషాలు సినిమాకి ఆయువుపట్టు అని చెప్పాలి. ఎందుకంటే చివరి 30 నిమిషాల్లో మొదటి నుంచి దాచి పెట్టిన ట్విస్ట్ లన్నిటినీ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తుంటారు. సెకండాఫ్ వేగం పెంచడంతో అది కవర్ అయిపోతుంది. ఇది పూర్తిగా మనోజ్ షో అనే చెప్పాలి. తన సెటిల్డ్ పర్ఫార్మెన్సే సినిమాకి ప్లస్. నేత్ర నిజంగానే చనిపోయిందా? బతికే ఉందా? అనే ఆసక్తి ప్రేకకులకు కలిగేలా సీన్స్ అల్లడం బాగుంది. శౌర్య ఆడే ఇంటెలిజెంట్ గేమ్ బాగుంటుంది. ట్విస్ట్ లను ఊహించే విధంగా ఉండవు కాబట్టి ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు. చివరికి వచ్చేసరికి సుబ్బరాజు హంతకుడు అని ఊహించగలిగినా, మనోజ్ ఎందుకు తన మీద హత్య నేరం వేసుకుంటాడనే అంశం ఆసక్తిగా ఉంటుంది.రొటీన్ కి భిన్నంగా మంచి స్టోరీ లైన్ తో సాగే చిత్రం ఇది. అక్కడక్కడా చిన్ని చిన్ని లోపాలు కనిపించినా.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా చూస్తే.. బాగానే ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి, ఎంటర్టైన్మెంట్ కాకుండా కాస్త స్లోగా నడిచే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు చూడదగిన చిత్రం ‘శౌర్య’.
తెలుగు360.కామ్ రేటింగ్: 2.25/5
బ్యానర్ ; సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లిమిటెడ్
నటీనటులు : మంచు మనోజ్, రెజీనా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, షయాజీ షిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్, బెనర్జీ, జి.వి, ప్రభాస్ శ్రీను, సత్యప్రకాష్, సూర్య, సుధ, హేమ తదితరులు
ఎడిటింగ్ :ఎస్.ఆర్.శేఖర్
సంగీతం : వేదా.కె
సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్ జోషి,
రచనా సహకారం : హరికృష్ణ, సాయికృష్ణ
రచన : గోపీ మోహన్
నిర్మాత : శివకుమార్ మల్కాపురం
సమర్పణ : బేబి త్రిష
స్ర్కీన్ ప్లే : గోపు కిషోర్
దర్శకత్వం : దశరధ్
విడుదల తేది : 04.03.2016