ఢి్ల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కవితను ఇరవై ఆరో తేదీ తర్వాత ఏ క్షణమైనా అరెస్టు చేయవచచ్చని ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తనను వర్చువల్ గా విచారించాలంటూ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈ నెల ఇరవై ఆరో తేదీన జరగనుంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత కవితను అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు.
కవితకు వ్యతిరకంగానే అప్రూవర్ల స్టేట్మెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం, ఆమే లబ్ది పొందిన వైనంపై పలు వివరాలను ఈడీ చార్జిషీట్లలో చెప్పింది. సౌత్ లాబీలో కవిత తరపున లావాదేవీలు నిర్వహించిన వారంతా అప్రూవర్ లు అయ్యారు. చివరికి శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా తో పాటు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, కవిత బినామీగా ఈడీ చెబుతున్న అరుణ్ రామచంద్ పిళ్లై కూడా అప్రూవర్లుగా మారారు. వీరుచెప్పిన వివరాలు… డాక్యుమెంట్లతో కవితను అరెస్ట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత తప్ప అందరూ అరెస్టయ్యారు.
అరవింద్ కేజ్రీవాల్ నూ ముంచేసిన అప్రూవర్లు
సౌత్ లాబీ అప్రూవర్లు ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రను స్పష్టంగా పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. . ‘‘కల్వకుంట్ల కవితతో నన్ను మాట్లాడమని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. లేదా ఆమే నాతో మాట్లాడతారని చెప్పారు. మీరిద్దరూ కలిసి పనిచేయవచ్చన్నారు. అన్ని వివరాలూ కవిత చూసుకుంటారు. ఆమె తన టీమ్‌తో కలిసి మద్యం విధానం గురించి పనిచేస్తున్నారు. కవిత టీమ్‌తో విజయ్ నాయర్ కలిసి పనిచేస్తున్నారు’’ అని మాగుంట రాఘవ ఈడీకి చెప్పారు. ఇటీవలే అప్రూవర్ అయిన ఎంపీ శ్రీనివాసులరెడ్డి రూ.100 కోట్ల ముడుపుల్లో తమ వాటా కింద రూ.25 కోట్లను తన కుమారుడు రాఘవ.. బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి చెల్లించారని చెప్పారు.
రెండు నెలలు జైల్లో పెడతారంటున్న రేవంత్ రెడ్డి
అయితే కవితను అరెస్ట్ చేస్తారని కానీ ఇదంతా డ్రామా అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కేసీఆర్ కు సానుభూతి అస్త్రం ఇచ్చేందుకు బీజేపీ ఇలా చేస్తోందని.. రాజకీయ ప్రయోజనాల కోసం .. పదవిని కాపాడుకునేందుకు కూతుర్ని జైలుకు పంపేందుకు కూడాకేసీఆర్ వెనుకాడటం లేదు. రెండు నెలలు కవితను తీహార్ జైల్లో పెడతారని ఆయన అంటున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఆయన ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే ఇలా మాట్లాడుతున్నారని రాజకీయవర్గాలంటున్నాయి.