చంద్రబాబు అవినీతి చేశారని ఒక్క ఆధారం చూపించకుండా ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని షెల్ కంపెనీల పేర్లతో షెల్ కేసు పెట్టి రచ్చ చేస్తున్న సీఐడీ అధికారులు రోజులు గడిచే కొద్దీ తమది కుట్రేనని పరోక్షంగా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తోంది. చంద్రబాబుపై ఆధారాలున్నాయని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు కానీ న్యాయస్థానాలకు సమర్పించండం లేదు. అదే సమయంలో ఆధారాల కోసమే కస్టడీ కావాలని.. టీడీపీ బ్యాంక్ అకౌంట్లు చూస్తామని వింత వాదనలు చేస్తున్నారు.
టీడీపీ బ్యాంక్ అకౌంట్లు ఇప్పటికే అనధికారిక తనిఖీ !
టీడీపీ బ్యాంక్ అకౌంట్లు సీఐడీ ఇప్పటి వరకూ చెక్ చేయలేదంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఎంత మంది టీడీపీ నేతలు, వారితో సబంధం ఉన్న వారి బ్యాంక్ అకౌంట్ల నివేదికలను అనధికారికంగా సీఐడీ అధికారులు తీసుకున్నారో అందరికీ తెలుసు. చివరికి అప్పట్లో ఓ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసిన వ్యక్తి కుటుంబసభ్యుల బ్యాంక్ అకౌంట్లను కూడా అనధికారికంగా యాక్సెస్ చేసుకున్నారు. దీనిపై వివాదం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు కొత్త వాదనలు వినిపిస్తున్నారు. ఆధారాలు చూపించకుండా ఎందుకు నాటకాలు ఆడుతున్నారో.. అందరికీ క్లారిటీ వస్తోంది.
నగదు మళ్లింపుపై ఒక్క ఆధారం లేదు – షెల్ కంపెనీల గురించీ లేదు !
నగదు మళ్లింపుపై సీఐడీ అధికారులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. రూ. 371 కోట్లు దారి మళ్లాయన్నారు. ఎలా దారి మళ్లాయి… దారి మళ్లడం అంటే ఏమిటి.. ఇవన్నీ న్యాయస్థానాలకు చెప్పాలి కదా. కనీసం ఏ కోర్టులో విచారణ జరిగినా దీని గురించి చెప్పడం లేదు. నోట్ ఫైల్స్ లో ఎక్కడో పీవీ రమేష్ ఏదో రాశారని.. ఆ కొద్ది భాగం లీక్ చేసి వైరల్ చేస్తున్న సీఐడీ అధికారులు నిజంగా చంద్రబాబు లేదా అయన కుటంబసభ్యులకు ఒక్క రూపాయి అందినట్లుగా ఉన్నా బయట పెట్టాలి కదా. అసలు డబ్బులు దుర్వినియోగమా… అవినీతా అన్నది కూడా చెప్పడం లేదు. దుర్వినియోగం అయితే… చంద్రబాబు ఎలా బాధ్యుడు.. అవినీతి అయితే.. చంద్రబాబు అందిన సొమ్ము వివరాలు చూపించారు. కానీ దర్యాప్తు సంస్థ కన్వీనియంట్‌గా ఎక్కడ ఏది అవసరం అయితే అదే వాదిస్తున్నారు.
కుట్రల్లో మామూలు స్కిల్ కాదు !
చంద్రబాబు అవినీతి చేశారని ఆరోపించడానికి చివరికి ఓ తప్పుడు కేసును ఆధారం చేసుకోవాల్సి వచ్చింది. ఇందు కోసం ,సీఐడీ అధికారుల స్కిల్ చూస్తే.. కరుడుగట్టిన క్రిమినల్స్ కూడా ఇంత ఘోరంగా ఆలోచించలేమో అని ఎవరైనా అనుకుంటారు. అయినా చివరికి ఏమీ చేయలేక… చిన్న ఆధారం చూపించలేక.. అరెస్టు చేసి జైలుకు పంపి… ఆధారాల కోసం వెదుకుతున్నట్లుగా షో చేస్తున్నారు. ప్రాజెక్టులో గమైన వారంతా.. అసలు స్కాం లేదని చెబుతున్నారు. కానీ సీఐడీ మాత్రం ఏమీ కనిపెట్టకపోయినా స్కాం ఉందంటున్నారు.
అధికారులపై ఒత్తిడి అనే కథ చెబితే న్యాయస్థానాల్లో నిలబడుతుందా ?
ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు డబ్బులు రిలీజ్ చేశారని సీఐడీ వాదిస్తోంది. గవర్నమెంట్ ఎలా నడుస్తుందో తెలిస్తే.. ఈ వాదన చేయరు. ఒత్తిడి చేయడం అంటే ఏమిటి ? . డబ్బులు విడుదల చేయాలని చెప్పడం నేరం అవుతుందా ? ఆ డబ్బులకు సరిపడా ఒప్పందానికి తగ్గట్లుగా అన్నీ స్కిల్ సెంటర్లు ఉంటే దుర్వినియోగం ఎక్కడ ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా… కుట్రలో 360 కోణాలూ బయటకు రావాల్సిందే. అప్పుడు సీఐడీ గురించి ప్రభుత్వం గురించి దేశం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటారు.