తెలంగాణ బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. టిక్కెట్ల కోసం ఆరు వేల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో పట్టుమని పది మంది కూడా బలమైన నేతలు లేరు. టిక్కెట్లు తీసుకున్న నేతలుకూడా ఉంటారో ఉండరో ఎవరికీ తెలియడం లేదు. కాంగ్రెస్ లోకి వెళ్తారని చాలా మందిపై ప్రచారం జరుగుతోంది.కానీ కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదని తేలిన తర్వాత బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.
నిన్నటిదాకా కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనకు టిక్కెట్ నిరాకరించి అవమానించడంతో ాయన బీజేపీలో చేరారు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ పెద్దపల్లి ఎంపీ సీటు ఇచ్చేందుకు అంగీకరించడంతో మళ్లీ బీఆర్ఎస్లో చేరుతారన్న చర్చ జరుగుతోంది. బాల్క సుమన్ కు ప్రాధాన్యం ఇవ్వడానికే తనను తొక్కేశారని వివేక్ అనుమానం. అందుకే బాల్క సుమన్ ఆయనతో సమావేశం అయి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
ప్రస్తుతం బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్రెడ్డిలకే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తూ మిగతా సీనియర్లకు సరైన గౌరవం ఇవ్వట్లేదనే అసంతృప్తి బీజేపీలో ఉంది. ఆయా పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ఒక దగ్గర భేటీ అయ్యి ఇదే అంశంపై పలుమార్లు చర్చించారు. ఆ నేతల్లో చాలా మంది కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతుండగా.. వివేక్ మాత్రం బీజేపీ గోడ మీద నిలబడి ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నేతలతోనూ సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు.
ఒక్క వివేక్ మాత్రమే కాదు.. టిక్కెట్లు ప్రకటించిన సీనియర్లు కూడా గుడ్ బై చెబుతారేమోనని.. నామినేషన్లు పడే వరకూ అభ్యర్థుల్ని ఖరారు చేయకపోవడమే మంచిదన్న వాదన బీజేపీలో వినిపిస్తోంది.