రాజకీయ కుట్రల కోసం కన్నూమిన్నూ కానరానట్లుగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఏపీసీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్‌ను ఏ 14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అసలు ఈ కేసే విచిత్రమైనది. ఎందకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేదే లేదు. ఒక్క సెంట్ భూసమీకరణ లేదా భూసేకరణ చేయలేదు. కేవలం ప్రణాళిక వేశారు. అదే పెద్ద కుట్రంటూ కేసు పెట్టేసి చంద్రబాబును ఏ వన్, నారాయణను ఏ టుగా పెట్టేశారు. నారాయణతో పాటు ఇతరులు .. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
కానీ చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం వెళ్లలేదు. ఇటీవలే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ కేసులో నారా లోకేష్ ను చేర్చారు. ఈ కేసులో అసలు నిధుల ఖర్చే జరగలేదు కాబట్టి దుర్వినియోగం అన్న సమస్య కానీ.. కుంభకోణం అన్న ప్రశ్న కూడా రాదు. మరెందుకంటే.. రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చి.. అస్మదీయులకు లాభం చేకూర్చరన్నది వాదన. అసలు ఇన్న రింగ్ రింగ్ అలైన్ మెంట్ ఖరారు కాలేదు.. అయినా చట్టం, న్యాయాలపై ఎంత నమ్మకం ఉంటే… మంగళగిరి ఎమ్మెల్యేతో ఫిర్యాదు చేయించి మరీ కేసు నమోదు చేయించి ఉంటారు. ఇంకా ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే.. ప్రభుత్వ అధికారులే ఫిర్యాదు చేసి ఉండాల్సింది. ఏమీ లేని గాలి కేసులను ప్రతిపక్ష నేతలపై పెట్టి.. అరెస్టులు చేసి ఏం సాధిద్దామనుకుంటున్నారో కానీ.. మొత్తంగా వ్యవస్థలపైనే అనుమానం ఏర్పడేలా చేయడంలో రాటుదేలిపోతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేశాం.. లోకేష్ ను అరెస్ట్ చేస్తాం.. తర్వాత పవన్ కల్యాణ్ వంతు అని వైసీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
అందర్నీ జైల్లో పెట్టి ఎన్నికలకు పోతామని వారు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అది ఎలా సాధ్యమని ఒక్క నిమిషాన్ని వారు ప్రశ్నించుకోలేకపోతున్నారు. అదే సాధ్యం అయితే.. ఆ నేతలంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జైళ్లలో ఉండే వారు కాదా అని ఆలోచించలేకపోతున్నారు. ఇక్కడ ట్విస్టేమింటటే.. పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగాచేసిన చంద్రబాబును ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా అరెస్ట్ చేసి.. రిమాండ్ కు పంపించగలిగిన ప్రభుత్వం లోకేష్ విషయంలో మాత్రం కాస్త పద్దతి పాటించి.. ముందుగానే నిందితుడిగా చేరుస్తూ ఏసీబీకోర్టులో మెమో దాఖలు చేసింది .