ఇది వరకు ఇండస్ట్రీ రికార్డ్ ఉండేవి. దాని అర్థం రాజమౌళి వచ్చాక మారిపోయింది. రాజమౌళి రికార్డ్స్, నాన్ రాజమౌళి రికార్డ్స్ గా విడగొట్టి చూస్తున్నారు. రాజమౌళి తప్ప.. రాజమౌళి సినిమా రికార్డుల్ని ఇంకెవరూ బ్రేక్ చేయలేరని అర్థమైపోయింది. అందుకే నాన్ రాజమౌళి రికార్డ్స్‌పై దృష్టి పెట్టారంతా. `గుంటూరు కారం` టార్గెట్ కూడా అదే. ఈ సినిమా వసూళ్లు రాజమౌళి సినిమాల వసూళ్లకు అతి దగ్గర్లో ఉంటాయని నిర్మాత నాగవంశీ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నార్ట. ఆయన నిర్మించిన `మ్యాడ్` విడుదకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో `గుంటూరు కారం`పై గతంలో నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. `ఆ మాటకు కట్టుబడి ఉన్నా. మేం నాన్ రాజమౌళి రికార్డులు బద్దలు కొడతామ`ని మరోసారి మహేష్ అభిమానులకు బూస్టప్ ఇచ్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకూ ఒక్క పాట కూడా బయటకు రాలేదు. తమన్ ఇస్తున్న ట్యూన్ల పట్ల మహేష్, త్రివిక్రమ్ అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఒక్క పాట కూడా రెడీ కాలేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే నాగ వంశీ మాత్రం దసరాలోపు తొలి పాటని విడుదల చేస్తామని ప్రకటించారు.