తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే సమస్య కావడంతో ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. కానీ తగ్గకపోవడంతో ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందాన్ని యశోదా ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసింది. అందుకే కేసీఆర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటకు చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకటో తేదీన అధికారిక పర్యటన కోసం తెలంగాణకు రాబోతున్నారు. హైదరాబాద్లో అధికారిక కార్యక్రమం తర్వాత రాజకీయసభ కోసం మహబూబ్ నగర్ వెళ్తారు. మళ్లీ మూడో తేదీన కూడా తెలంగాణకు వస్తారు. బీజేపీపై యుద్ధం ప్రకటించిన తర్వాత ఆయన ఎప్పుడూ మోదీకి స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి బాధ్యతలిచ్చేవారు. ఈ సారి కూడా ఆయనకే చాన్సిస్తారు. ప్రత్యేకంగా ప్రకటన చేయాల్సిన పని లేకుండా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కేటీఆర్ ముందుగానే సమాచారం ఇచ్చినట్లయింది.
రాజకీయంగా ఇప్పుడు కీలకమైన సమయం. అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్.. ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. రేపోమాపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇాలంటి కీలక సమయంలో ఆయనకు జ్వరం వల్ల కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలను చూసకునే పరిస్థితి లేకపోవడంతో మొత్తం వ్యవహారాల్ని కేటీఆరే చక్క బెట్టాల్సి ఉంటుంది.