తెలంగాణ బీజేపీ తాము కూడా రేసులో ఉన్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత పుంజుకోకపోగా మరింత బలహీనపడింది.. కిషన్ రెడ్డి నాయకత్వం ఉందా లేదా అన్నట్లుగా మారింది. దీంతో కేంద్ర బీజేపీ ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. ఐదుగురు కేంద్ర మంత్రులతో ఇరవై ఆరు మంది సభ్యులతో ఓ కమిటీని వేశారు. ఏపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.
ఎన్నికల వేళ బీజేపీ సైలెంట్ కావడం, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ పార్టీ శ్రేణలు కాస్త డీలాపడ్డాయి. అందుకే తాము రేసులో ఉన్నామని చెప్పుకునేందుకు హడావుడి ప్రారంభించింది. మోదీ, అమిత్ షాలు పర్యటించబోతున్నారు. కానీ వారి పర్యటనలకు హైప్ రావడం లేదు. అక్టోబర్లో ఏకంగా 30 నుంచి 40 బహిరంగ సభలు నిర్వహిస్తామని చెబుతున్నారు. కేంద్రమంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు పాల్గొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు.. ఎన్నికలకు సిద్ధమయ్యేలా పలు సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మహబూబ్నగర్ పట్టణ శివార్లలోని భూత్పూర్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మోడీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది.. ఈ సభలతో అయినా తాము చాలా సీరియస్ గా ఉన్నామని ప్రజలు అనుకోవాలని భావిస్తోంది.