అసెంబ్లీ ఆమోదించిన జీపీఎస్ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం … ఉద్యోగ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఎవరైనా సరే 62 ఏళ్లు వచ్చే వరకూ ఉద్యోగంలో ఉంటానంటే కుదరదు. 33 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే… ఇంటికెళ్లిపోవాల్సిందే. అదే అంత కాలం సర్వీస్ పూర్తి కాక ముందే 62 ఏళ్లు వస్తే అదే సమయానికి ఇంటికి పంపేస్తారు. జీపీఎస్ బిల్లులో పెట్టిన ఈ నిబంధన వెనుక చాలా పెద్ద లోతైన కుట్ర ఉందని ఉద్యోగ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఉద్యోగాల భర్తీ పూర్తిగా నిలిపివేశారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచారు. రెండేళ్లకిందట రిటైరవ్వాల్సిన వారంతా ఇప్పుడు రిటైర్మెంట్ కు దగ్గరవుతున్నారు. ముఫ్పై మూడు ేళ్లు సర్వీస్ పూర్తయిన వారూ అంతకు మించి రెండింతలు ఉంటారు. వీరందరూ ఒక్క వచ్చే ఎన్నికల నాటికి లేదా ఎన్నికలు పూర్తయ్యే నాటికి రిటైర్ అవుతారు. బలవంతంగా అయినా పంపించేస్తారు. అది కాదు విషయం. మరి పాలన ఎలా సాగుతుంది ? . ఇక్కడే ఉంది అసలు విషయం. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోనే బండి నడిపిస్తారు. అదే ప్లాన్ తోనే ప్రభుత్వం ఈ జీపీఎస్ బిల్లు తెచ్చిందని ఉద్యోగులు అనుమానిస్తున్నారు.
జగన్ రెడ్డి దెబ్బకు అత్యంత ఘోరంగా మోసపోయిన వర్గంగా ఉద్యోగవర్గం మారింది. సీపీఎస్ పేరుతో చేసిన మోసమే కాదు.. రివర్స్ పీఆర్సీ ఇచ్చి జీతాలను తగ్గించారు. అంతేనా.. ఒక్క డీఏ సరిగ్గా ఇవ్వడం లేదు. ఒక్కో ఉద్యోగి లక్షల విలువైన ప్రయోజనాలను కోల్పోయారు. అంతకు మించి తీవ్రమైన అవమానాలను ఎదుర్కొంటున్నారు.