జగన్ రెడ్డికి కూడా త్వరలోనే జైలుకెళ్లే పరిస్థితి వస్తుందని పీసీసీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న ఎన్.రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన ాయన.. బీజేపీ ఒత్తిడితోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టిన ప్రయోజనం శూన్యమని… చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని… కాబట్టి టీడీపీ కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. బీజేపీ, ప్రధాని మోదీ , అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని అన్నారు. వీటన్నింటికీ మూల కారణం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలన్నది ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఏదో ఒకరోజు జగన్కు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండదని రఘువీరారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ ప్రమేయం ఉందని చాలా మంది ప్రచారం చేస్తున్నారు కానీ..అసలు విషయం మాత్రం క్లారిటీ లేదు.
కానీ కేంద్రం వైపు నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి స్పందన రాలేదు. ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఖండించారు. బండి సంజయ్ లాంటి వారు జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని విమర్శించారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో కాంగ్రెస్ నేతల ఎక్కువగా బీజేపీనీ ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా.. చంద్రబాబు బీజేపీతో కలిసి వెళ్లకుండా అలా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అరెస్టుపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎవరూ అవి అవినీతి కేసులని అనడం లేదు. ఖచ్చితంగా రాజకీయ కేసులంటున్నారు. వీటిని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉందంటున్నారు.