వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కు అందరూ రెడీ అయిపోయారు. కానీ కేంద్రం మాత్రం వెనుకడుగు వేసింది. ఇప్పుడల్లా సాధ్యం కాదని లా కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్లుగా ఢిల్లీ మీడియా ప్రకటించేసింది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమే అని రామ్ నాథ్ కోవింద్ కమిటీకి నివేదిక సమర్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. జమిలి ఎన్నికలపై రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.
ఒకే దేశం, ఒకే ఎన్నిక పై లా కమిషన్ సెప్టెంబర్ 27న సమావేశమైంది. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ చర్చిస్తోంది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేంద్రం తదుపరి కార్యాచరణ ఉండనుంది. అయితే ఈ కమిటీకి కాలపరిమితిలేదు. అందుకే ఎప్పుడు నివేదిక ఇస్తుందో స్పష్టత లేదు. అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా ఈ కమిటీ నిర్ణయించనుంది.
ఈ కమిటీకి లా కమిషన్ చేసే సిఫార్సులు కీలకం కానున్నాయి. అన్ని స్థాయిల ఎన్నికలు ఒకే సారి నిర్వహించాలంటే లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారాలు చూపడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. ఏదైనా ఒక్క సారే ఎన్నికలు పెట్టగలరు కానీ.. తర్వాత మళ్లీ.. మధ్యలో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని.. భారత ప్రజాస్వామ్యంలో ఉపఎన్నికలు… మధ్యంతర ఎన్నికలు.. ప్రభుత్వాలు కూలిపోవడం వంటివి కామన్ అని చెబుతున్నారు. అందుకే జమిలీ ఎన్నికలపై బీజేపీ మరోసారి గెలిస్తే కొత్త ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.