మేనిఫెస్టోలో చెప్పినట్లుగా స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేసి ఎన్నికలకు వెళ్తాం… లేకపోతే ఓట్లు అడగబోమని జగన్ రెడ్డి అండ్ కో ఎన్ని సార్లు చెప్పారో లెక్కే లేదు.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. మరి మద్యాన్ని స్టార్ హోటళ్లకే పరిమితం చేశారా అంటే… వైసీపీ నేతలు కూడా పగలబడి నవ్వుకుంటున్నారు. నాలుగేళ్ల పాటు .. ఏటా ఇరవై శాతం షాపులు తగ్గించుకుంటూ వస్తామని మొదటి ఏడాది కాస్త తగ్గించారు. తర్వాత తగ్గించలేదు. ఇప్పుడు వాకిన్ స్టోర్లు, టూరిజం స్టోర్లు అని తగ్గించినవి కూడా పెంచారు. మొత్తంగా ఒక్క దుకాణం తగ్గకపోగా మరింత పెరిగాయి. మరిన్ని దుకాణాలకు అనుమతి ఇస్తూ… మరో ఏడాది పాలసీని ప్రభుత్వం పొడిగించింది.
మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఏడాదికి పాలసీ పొడిగించారు . అంటే అసలు మద్య నిషేధం అనే ఆలోచన లేదని తేలిపోయింది. మరి ఇచ్చిన హామీ ఏదంటే ఓటర్ల వైపు వెకిలిగా చూసే పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చాక.. మద్యం ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా రేట్లు పెంచుతానని… ఆ తర్వాత దుకాణాల సంఖ్యను తగ్గిస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే మద్యం ధరలు ఊహించనంతగా పెంచేశారు. మద్యం అలవాటు ఉన్న కుటుంబాల్ని పీల్చి పిప్పి చేశారు. నాలుగేళ్ల కాలంలో లక్ష కోట్ల మద్యం అమ్మకాలు ప్రభుత్వం నిర్వహించింది. అంతకు మించి బ్లాక్ లో ఇతర రాష్ట్రాల మద్యాన్ని వైసీపీ నేతలు స్మగ్లింగ్ ద్వారా అమ్మి ఉంటారు.
మద్యంపై జగన్ రెడ్డి చెప్పిన మాటలు.. ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల కనీసం ఆలోచన ఉంటే..తన వ్యక్తిత్వాన్ని ప్రజలు మరో రకంగా ఊహించుకుంటారన్న భయం ఉంటే.. కనీసం ఎన్నికలకు ముందు అయినా మద్యం నిషేధం గురించి ఆలోచించేవారు. కానీ తప్పుడు పనులు చేయడం తనకు అలవాటేనన్నట్లుగా ఆయన మద్యం హామీని విస్మరించి… ప్రజలకు చెప్పుకోలేక ప్రతిపక్ష నేతల్ని అరెస్టులు చేసి తాను ఎన్నికలకు వస్తున్నానని… మాట వినకపోతే మీకూ గ్యారంటీ ఉండదని ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఓటు ఆయుధం ప్రజల దగ్గర ఉంటుందనే సంగతిని జగన్ రెడ్డి మర్చిపోయారు.