తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైరల్ ఫీవర్ తగ్గకపోడవంతో కీలక పథకాల ఆమోదం కోసం నిర్వహించాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. కేంద్ర ఎన్నికల సంఘం… మూడు రోజుల పాటు తెలంగాణలో అక్టోబర్ మొదటి వారంలో పర్యటించనుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఇలాంటి కీలక సమయంలో కేసీఆర్ వైరల్ ఫీవర్ బారిన పడటంతో కేటీఆర్ అటు అధికారిక బాధ్యతల్ని.. ఇటు పార్టీ బాధ్యతల్ని చూసుకోవాల్సి వస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చే గడువు దగ్గర పడుతూండటంతో అధికార బీఆర్ఎస్ అందుకనుగుణంగా స్పీడు పెంచాల్సి ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇటీవల ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. వీటిపై విస్తృత ప్రచాతరం చేస్తున్నారు. వాటికి ధీటుగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రూపొందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకే ప్రత్యేకమైన పథకాలు డిజైన్ చేశారు. వాటిని కేబినెట్లో ఆమోదించాలని అనుకుంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి… నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. అందుకే ఈలోపే కేబినెట్ భేటీ నిర్వహించాలనుకుంటున్నారు. అలాగే నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా గతంలో మంత్రివర్గం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ తిరస్కరించారు. మరోసారి క్యాబినెట్ వారి పేర్లను ఆమోదించి, గవర్నర్కు తిరిగి సిఫారసు చేయాలని అనుకుంటున్నారు. గవర్నర్ మళ్లీ పెండింగ్ పెడితే మొదటికే మోసం వస్తుంది. ఎన్నికల తర్వాత మళ్లీ బీఆర్ఎస్ వస్తే సరే లేకపోతే.. .. ఆ రెండు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కు రాకుండా పోతాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచార భేరీ మోగించాల్సి ఉంది. కాంగ్రెస్ నెలకో బహిరంగసభ నిర్వహిస్తోంది. చేరికలతో జోరు చూపిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ వెనుకబడిపోయిన ఫీలింగ్ వస్తోంది. కేసీఆర్ కోలుకున్న తర్వాత సీన్ మారిపోతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.