జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన పార్టీ అధినేత స్పష్టంగా ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్ తొలి సారి ప్రజల్లోకి వస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ క్యాడర్ కూడా పవన్ యాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.
చంద్రబాబు అరెస్ట్ కారణంగా పార్టీ వ్యవహారాలను నడిపించడానికి పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ చేసిన ప్రాంతంలో సమావేశం అయింది. నందమూరి బాలకృష్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత బాలకృష్ణ వారాహియాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనసేన, టీడీపీ కలిసి పోరాటాలు చేసేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమన్వయం చేసుకునేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
టీడీపీ, జనసేన పొత్తు రాజకీయ ముఖ చిత్రం మార్చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో కలిసిపోయే వాతావరణాన్ని రెండు పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో సొంత ఎజెండాలతో వ్యవహరిస్తున్న కొంత మందిని పూర్తిగా పక్కన పెట్టాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. వారితో తమ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది.