ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ సారి కొత్త పలుకులో పరోక్షంగా న్యాయవ్యవస్థపై ప్రజల్లో వస్తున్న అనేక సందేహాలను తన ఆర్టికల్ ద్వారా వెల్లడించారు. ఇందులో ప్రధానంగా రెండు కేస్ స్టడీలను తీసుకున్నారు. ఒకటి అవినాష్ రెడ్డి. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఎంత ప్రబలంగా ఉందో సీబీఐ వెల్లడించింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్న సమయంలో కర్నూలులో ఆస్పత్రిలో తల్లికి అనారోగ్యం పేరుతో వారం రోజులు దాక్కున్నారు. హైకోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు అయిన తర్వాతనే బయటకు వచ్చారు. అవినాష్ రెడ్డికి బెయిల్ పై అంతకు ముందు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్టును తప్పించుకునేందుకు చట్టాన్నీ ఉల్లంఘించారు. చివరికి హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అంతేనా అరెస్టు చేయాల్సి వస్తే వెంటనే బెయిల్ ఇవ్వాలని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం అవినాష్ రెడ్డి అరెస్టు, విడుదల .. పేపర్లపై జరిగిపోయాయి.
రెండో ఉదాహరణగా కల్వకుంట్ల కవిత కేసును ఆర్కే ఉదహరించారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం ఎం చేశారో… ఎంత ఆదాయం పొందాలో ఈడీ, సీబీఐ తమ చార్జిషీట్లలో పొందు పరిచాయి. అందర్నీ అరెస్టు చేశారు కానీ కవితను మాత్రం అరెస్టు చేయలేదు. అంతే కాదు… రెండు నెలల పాటు అసలు విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు నుండి రిలీఫ్ లభించింది. ఈ రెండు కేసుల్లో ఆధారాలున్న నిందితులకు కోర్టులు ఉపశమనం కల్పిస్తే.. అసలు ఆధారాలు లేని కేసులో చంద్రబాబును నెల రోజుల వరకూ జైల్లో పెట్టడం ఏమిటని… ఇది న్యాయవ్యవస్థ వైఫల్యమా లేకపోతే మరొకటా అన్నది ఆర్కే వేసిన ప్రశ్న.
కోర్టులో నిందితులు, సాక్షులతో తాము నిజమే చెబుతామని భగవద్గీతపై ప్రమాణం చేయిస్తారని… ఇక నుంచి న్యాయమూర్తులు కూడా తాము న్యాయమైన తీర్పులే ఇస్తామని ప్రమాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రసిద్ధ కార్టూనిస్టులు కార్టూన్లు వేస్తున్నారంటే… ప్రజల్లో న్యాయవ్యవస్థపై పెరిగిపోతున్న అనుమానాలకు నిదర్శనమని ఆర్కే చెబుతున్నారు. ఆర్కే తన ఆర్టికల్ లో న్యాయవ్యవస్థ .. తీర్పులను ఎక్కడా ప్రశ్నించలేదు. విమర్శించలేదు. తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో ప్రజల్లో చర్చ పెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన కామెంట్ ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా … ఈ ఆర్టికల్ లోని శ్లేష అందరికీ అర్థమవుతుంది.
చంద్రబాబు విషయంలో జరుగుతున్నరాజకీయంలో బీజేపీ ప్రమేయం ఉందని చాలా విశ్లేషణలు వస్తున్నా ఆర్కే మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆలోచనలు చేసి రాయడంలేదు. కానీ… బీజేపీకి తెలంగాణలోనూ మరింత నష్టం జరగబోతోందని హెచ్చరించారు. బహుశా… చంద్రబాబు విషయంలో తదుపరి అంశాలపై స్పష్టత వస్తే… ఈ అంశంపై వచ్చే వారం సుదీర్ఘమైన పలుకును ఆర్కే వివరించే అవకాశం ఉంది.