జనసేన పార్టీకి ముందు నుంచి ఓ సమస్య ఉంది. తాము జనసేన కార్యకర్తలమని చెప్పుకుంటారు.. కానీ వైసీపీ ఓటర్లమంటారు. జనసేనను బలపర్చడం కన్నా టీడీపీని తిట్టడం.. వైసీపీకి మేలు చేయడం వారి విధి. ఇలాంటి వారి వల్లనే జనసేన నష్టపోతోందని గుర్తించారు. అందుకే పవన్ కల్యాణ్… సభలకు వచ్చే వారు.. జనసేన విధి, విధానాల్ని తెలుసుకోవాలని .. ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెబుతూ ఉంటారు. ఈ సారి కూడా అలాంటి వారు జోరూ చూపించే ప్రయత్నం చేశారు. కానీ జనసేన మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటోంది.
జనసేన ముసుగులో ఉండే వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పొత్తులపై కామెంట్స్ చేస్తూండటంతో నాగబాబు రంగంలోకి దిగారు. అలాంటి వారు పార్టీ నేతలు కాదని తేల్చేశారు. గట్టి వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని నాగబాబు తేల్చి చెప్పారు. ఈ విషయంలో జీరో టోలరెన్స్ అని కూడా చెబుతున్నారు. పార్టీ కోసం సోషల్ మీడియాలో స్వచ్చందంగా పని చేస్తున్నామని చెప్పుకునేవారికీ హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో ఇలాంటి వారు దాదాపుగా గొంతు సవరించుకుంటున్నారు. పొత్తులపై క్యాడర్ మాత్రం కలసిపోయారు. నిజానికి పంచాయతీలు, స్థానిక ఎన్నికల్లోనే బలం ఉన్న చోట్ల టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. క్యాడర్ ఎప్పుడూ కలిసే ఉంది. కానీ సోషల్ మీడియాలో ఎజెండాలతో వచ్చే వారితోనే సమస్య వస్తోంది. వారినీ దారికి తెస్తున్నారు. లేకపోతే గెంటేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకుంటే జనసేన, టీడీపీ మధ్య ఎలాంటి సమస్యలు ఉండవని.. సాఫీగా ఓట్ల బదిలీ జరిగిపోతుందని నమ్ముతున్నారు.