గత ఎన్నికలకు ముందు ఏపీకి రైల్వేజోన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఐదేళ్లు దాటిపోయాయి. అప్పు రేపు అన్నట్లుగా రైల్వేజోన్ పెడతామన్నాం కదా అని అంటూనే ఉన్నారు కానీ కనీసం ఒక్క అడుగు ముందుకు వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ముంగిట… రేపోమాపో షెడ్యూల్ రాబోతున్న సమయంలో తెలంగాణలోని మహబూబ్ నగర్లో బహిరంగసభ పెట్టిన ప్రధాని మోదీ తెలంగాణకు పసుపుబోర్డు ప్రకటించారు. పసుపుబోర్డు అంటే.. తెలంగాణ పసుపు రైతులకు కడుపు మండిపోతుంది.
గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు రైతులు వందల మంది నిజామాబాద్ బరిలో నిలిచారు. ఆ సమయంలో బీజేపీ గెలిస్తే పసుపుబోర్డు ఏర్పాటు ఖాయమని ఎంపీ అభ్యర్థి అర్వింద్ బాండ్ రాసిచ్చి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. మధ్య అడిగితే.. స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి.. అదే బోర్డు అన్నారు. ఇలా మోసం చేస్తారా అని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే ముందు మళ్లీ పసుపుబోర్డు హామీతో ప్రధానమంత్రి తెరపైకి వచ్చారు. ఐదేళ్లలో ఎందుకు ఏర్పాటు చేయలేదన్నది మాత్రం ఎవరూ అడగరు.. చెప్పరు.
ఇదొక్కటే కాదు.. ప్రధాని మోదీ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో చాలా హామీలు ఇచ్చారు. ములుగులో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ, రూ.900 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటివి ఉన్నాయి. ట్రైబల్ యూనివర్శిటీ విభజన చట్టంలో ఉన్న అంశం. పదేళ్ల వరకూ పట్టించుకోకుండా.. చివరిలో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
తెలంగాణలో రూ. 13500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఎన్నికల స్టంట్లు అని… చేసేవారు.. ఇచ్చే వారు అయితే.. ఎప్పుడో ఇచ్చే వారన్న వాదన తెలంగాణ ప్రజల్లో సహజంగానే వస్తోంది. కానీ బీజేపీ పెద్దలు .. తాము చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్తూంటారు. పదేళ్ల నుంచి తెలంగాణకు బీజేపీ ఏం చెప్పిందో వాటిలో ఒక్కటీ నెరవేరలేదని బీఆర్ఎస్ నేతలు చేసే విమర్శలు బలంగా చేస్తూనే ఉన్నారు.