ఏపీ భవిష్యత్‌ను ఫ్యాన్‌కు జగన్ రెడ్డి ఉరేశారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. నాలుగో విడత వారాహి యాత్రలో భాగంగా కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. వైసీపీ మహమ్మారికి వ్యాక్సిన్ జనసేన , టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులు.. మీరు కౌరవులని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. 100కి పైగా వైసీపీ వాళ్లు సభ్యులుగా ఉన్నారు కాబట్టి కౌరవులేనని తేల్చారు. మీరు అధికారం నుంచి దిగడం.. మేం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ఉద్యోగులు, నిరుద్యోగులను మోసం చేసిన జగన్
మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటాం. 2018 నుంచి ఉద్యోగాలు లేవు. 30వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. మెగా డీఎస్సీ వారికి న్యాయం జరగడం లేదని ప్రభుత్వం మారగానే ట్రిపుల్ ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి అవనిగడ్డ డీఎస్సీ శిక్షణలో ఆయువుపట్టు. 30 వేల పైచిలుకు డీఎస్సీ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. లక్షకోట్లు, కిరాయి సైన్యం, పోలీస్ శాఖ వారి దగ్గర ఉంది..మా దగ్గర ఏముంది ఒక మైక్ తప్ప ఏమీ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తీరుస్తానని.. ఆశయాలు, విలువలకోసం నడిపేవాడ్ని కాబట్టే నిలబడి ఉన్నానన్నారు. అధికారం కోసం నేను అర్రులు చాచడం లేదు. మీ భవిష్యత్ కోసం అనుక్షణం ఆలోచిస్తాను. మనకంటే.. మన పార్టీ కంటే.. మన నేల ముఖ్యం. పాదయాత్రలో జగన్ ఇవ్వని హామీలు లేవు.. అధికారంలోకి వచ్చాక అవన్నీ మరిచిపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో జనసేన చాలా దెబ్బలు తిన్నదని వైసీపీని ఓడించడమే జనసేన టార్గెట్ అని స్పష్టం చేశారు.
జగన్‌కు 15 సీట్లు వస్తే గొప్ప
అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కొవాలో నాకు తెలుసు. మూడు తరాలుగా రాజకీయాలు చేసే వ్యక్తితో పోరాటం చేస్తున్నా. డ్రాప్ అవుట్స్, మిస్సింగ్‌లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తన్నారు. డబ్బు మీద, నేలమీద నాకు ఎప్పుడూ కోరిక లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని అనుకున్నా. మనం, మన పార్టీల కంటే ఈ రాష్ట్ర నేల చాలా ముఖ్యం’ అని పవన్ తెలిపారు. తన నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకుంటున్నానని, ఓట్ల కొనేందుకు తన దగ్గర డబ్బలు లేవని పవన్ చెప్పారు. వైసీపీకి పదిహేను అసెంబ్లీ సీట్లు వస్తే గొప్ప అని స్పష్టం చేశారు.
జగన్ గురించి మోదీకి అన్నీ తెలుసు
బైజూస్‌ను బత్తాయి జ్యూస్‌లా పిండేశారని, వైసీపీ హయాంలో 3.88 లక్షల మంది విద్యార్థలు డ్రాపవుట్ అయ్యారని ఆరోపించారు. వైసీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే అభివృద్ది ఎక్కడని, జగన్ అద్బుతమైన పాలకుడైతే తనకు రోడ్డుపైకి వచ్చే అవసరం లేదన్నారు. ఇసుక దోపిడీ, అవినీతి గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్దామని అనుకున్నానని, ఈ దేశ ప్రధానికి జగన్ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. సమాఖ్య స్పూర్తి కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలని అన్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని పవన్ కల్యాణ్ జగన్ కు సలహా ఇచ్చారు. తాను ఇక్కడే ఉంటానన్నారు. తాను అసెంబ్లీలో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు.
కలసి వారాహియాత్రను సక్సెస్ చేసిన టీడీపీ, జనసైనికులు
పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటన చేసిన తర్వాత తొలి సారి వారాహి యాత్ర జరిగింది. టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అవనిగడ్డలో జనసేన నేతలతో కలిసి టీడీపీ శ్రేణులుకూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. దీంతో అవనిగడ్డ మొత్తం కిక్కిరిసిపోయింది.