MAD Movie Review
తెలుగు360 రేటింగ్ : 3/5
`వేర్ డ్రామా బిగెన్స్ లాజిక్ ఎండ్` అనే ఓ ఫేమస్ కోట్ ఉంది.
డ్రామా మొదలైన చోట.. లాజిక్కుల్ని పట్టించుకోం. దీన్నీ ఈతరం కాస్త కొత్తగా రాస్తోంది.
లాజిక్కులు వేసుకోని చోటే – వినోదం పుడుతుంది అని! జాతిరత్నాలు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మామూలుగా చూస్తే అవన్నీ సిల్లీ, నాన్ సింక్ సీన్స్‌లా అనిపిస్తాయి. కానీ.. లాజిక్కుల్ని పక్కన పెట్టి చూస్తే.. ఆ సినిమా ఓ సూపర్ డూపర్ హిట్. కామెడీ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఫన్ పుట్టించడానికి ఆమాత్రం మ్యాడ్ నెస్ అవసరం అనిపిస్తుంది. సరిగ్గా అదే కొలతలతో ఇంకో సినిమా వచ్చింది. అదే.. `మ్యాడ్`. మనోజ్, దామోదర్, అశోక్.. ముగ్గురు స్నేహితుల కథ ఇది. మనోజ్‌లోని `ఎం`, అశోక్ లోని `ఏ` దామోదర్ లోని `డీ` తీసుకొని దీనికి `మ్యాడ్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ లోనే ఇంత మ్యాడ్నెస్ ఉందంటే.. మరి సినిమాలో ఇంకెంత ఉందో.. అర్థం చేసుకోవొచ్చు. మరింతకీ ఈ పిచ్చి ఏ స్థాయిలో పేలిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ చాలా సింపుల్. మనోజ్, అశోక్, దామోదర్ అనే ముగ్గురు స్నేహితుల కథ ఇది. ముగ్గురూ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. అక్కడే పరిచయం.. అక్కడే స్నేహం. ఇంజనీరింగ్ ముగిసేసరికి వాళ్ల కథలు ఎలా రూపాంతరం చెందాయి? ఎవరి జీవితంలో ఎవరి పాత్ర ఎంత? వారి ప్రేమ కథలేంటి? తమ ప్రేమని గెలిపించుకోవడానికి చేసే తింగరి ప్రయత్నాలేంటి? ఇదే స్థూలంగా స్టోరీ!
కొన్ని సినిమాలకు కథలు అవసరం లేదేమో అనే భ్రాంతికి కలిగించే సినిమా `మ్యాడ్`. దర్శకుడు పెన్నూ, కాగితం పట్టుకొని కూర్చున్నప్పుడు కథని కాకుండా కేవలం సన్నివేశాలు మాత్రం రాసుకొంటూ, వాటినే పేర్చుకొంటూ వెళ్లాడనిపిస్తుంది. ఆ ప్రవాహంలోనే ఫన్ పుట్టుకొచ్చింది. ముగ్గురు కుర్రాళ్లు, వాళ్ల స్నేహం, అమాయకత్వం, ఆకతాయితనం నుంచి పుట్టుకొచ్చిన అల్లరి, వాళ్ల ప్రేమ కథలు, కాలేజీ గొడవలూ ఇదే.. సినిమా. ఇప్పటి వరకూ వచ్చిన కొన్ని కాలేజీ కథలు, కుర్రాళ్ల సినిమాలు.. ఇవన్నీ `మ్యాడ్` చూస్తున్నప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. కొన్ని సీన్లు హ్యాపీడేస్‌లా ఉంటాయి. ఇంకొన్ని హిందీలో వచ్చిన త్రీ ఇడియట్స్ లానో, చిచొరే లానో అనిపిస్తాయి. అయినా.. మనదైన ఫ్రెష్ ఫీల్ వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఇవన్నీ కొత్త మొహాలతో తీసిన సినిమా కాబట్టి. వాళ్లపై ఎలాంటి అంచనాలూ లేకుండానే సినిమా చూస్తుంటాం. జీరో ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి.. ఎంతిచ్చినా హెవీగానే ఉంటుంది. అలా.. చాలా సీన్లు పేలుతూ వెళ్లాయి. కాలేజీలో ప్రిన్సిపాల్ స్పీచ్, హాస్టల్ లో రాగింగు, ఎగ్జామ్స్ లో చిట్టీలు రాయడం, అమ్మాయిల వెంట పడడం, ఓ క్యాంటీన్ కోసం రెండు వర్గాల గొడవ… ఇవన్నీ పాత సినిమాలో బిట్లే. కానీ కొత్త మొహాల మీద ప్లే చేయడంతో.. అవి కూడా ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తాయి. హ్యాపీడేస్‌లో.. శేఖర్ కమ్ముల రెండు బ్యాచ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ పెట్టాడు. ఇక్కడ బాస్కెట్ బాల్ అంతే తేడా! ఈ రిఫరెన్స్ ని తెరపై దర్శకుడు కూడా గుర్తు చేసుకొని, మన పనిని మరింత సులభం చేస్తాడు. కాకపోతే.. హ్యాపీడేస్ లో క్రికెట్ ఎపిసోడ్ లానే. ఇందులో బాస్కెట్ బాల్ ఎపిసోడ్ కూడా నవ్వు తెప్పిస్తుంది.
కాలేజీ కథలతో వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే.. యూత్ త్వరగా కనెక్ట్ అయిపోతారు. `మన కాలేజీ లైఫ్‌లో ఇలానే జరిగింది కదా` అని అనుకొనేవాళ్లు కొంతమంది. `మనక్కూడా ఇలా జరిగి ఉంటే బాగుండేది` అని ఫీలయ్యేవాళ్లు ఇంకొంతమంది. మ్యాడ్ చూస్తే ఈ రెండు ఫీలింగ్స్ కలుగుతాయి. చిన్న చిన్న మూమెంట్స్, సింగిల్ లైనర్లు దర్శకుడు బాగా పట్టుకొన్నాడు. కాలేజీ సినిమా అనగానే. ప్రాణ స్నేహితుల మధ్య గొడవలు రావడం, విడిపోవడం, చివర్లో కలుసుకోవడం రొటీన్‌గా కనిపించే వ్యవహారాలు. ఈ సినిమా… వాటి జోలికి పోకపోవడం చాలా పెద్ద రిలీఫ్. చివర్లో.. ముగ్గురు స్నేహితుల మధ్య అగ్గి రాజుకొనే సందర్భం పుట్టించినా.. దాన్నిచాలా క్యాజువల్ గానే డీల్ చేసిన పద్ధతి బాగుంది.
ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త డల్ గా మొదలవుతుంది. అయితే.. లేడీస్ హాస్టల్ ఎపిసోడ్ తో కథకి మళ్లీ ఊపొస్తుంది. అంతకు ముందే.. `హైదరాబాద్- సికింద్రాబాద్` పాటతో భీమ్స్ కావల్సినం ఎనర్జీ తెచ్చి పెట్టాడు. చివరి పాట కూడా యూత్ కి నచ్చేస్తుంది. కథ, స్క్రీన్ ప్లే ట్విస్టు లాంటి పెద్ద పెద్ద విషయాల జోలికి పోకుండా, యూత్ కి ఏం నచ్చుతుంది? వాళ్లకు ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి? అన్నదానిపైనే దర్శకుడు ఫోకస్ పెట్టాడు. అలాగని ద్వందార్థాలూ, బూతులు జోలికి వెళ్లలేదు. లవ్ ట్రాకులు కాస్త బాగా రాసుకొంటే బాగుండేది. రెండు లవ్ ట్రాకులు ఉన్నా… అవి పెద్దగా రిజిస్టర్ కావు. పైగా.. ఆ లవ్ లో ఫీల్ కనిపించదు. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా కావాలని రాసుకొన్నదే తప్ప.. కథలో పెద్దగా సంఘర్షణ అనిపించదు. అజ్ఞాత ప్రేమికురాలి కోసం దామోదర్ ఆరాటపడే ఎపిసోడే కాస్తలో కాస్త బెటర్.
ముగ్గురు హీరోల్లో ఎక్కువ మార్కులు సంగీత్ శోభన్‌కి పడతాయి. తన ఫేస్.. కటౌట్ హీరోకి సరిపడవు కానీ.. ఈ పాత్రలో మాత్రం నూటికి రెండొందల మార్కులు కొట్టేశాడు. తన ఈజ్‌తో చాలా సన్నివేశాల్ని నడిపించేశాడు. సినిమాలో ఎక్కువ శాతం తనే కనిపిస్తుంటాడు. అయినా బోర్ కొట్టదు. ఆ తరవాతి స్థానం రామ్ నితిన్‌కి దక్కుతుంది. చూడ్డానికి కుర్రాడు బాగున్నాడు. తను ప్రేమకథలకు బాగా సరిపోతాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. నార్ని నితిన్ ఓకే అనిపిస్తాడు. సంగీత్, రామ్ మధ్య తేలిపోయాడు.కాకపోతే.. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర ఇచ్చారు. ముగ్గురు హీరోయిన్లూ చూడ్డానికి ఓకే అనిపిస్తారు. లడ్డూ పాత్రలో కనిపించిన నటుడు కూడా గుర్తుండిపోతాడు. కథంతా తన కోణంలోనే సాగుతుంది. సంగీత్ శోభన్ తరవాత తన పాత్రే ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. ప్రిన్సిపాల్ పాత్రలో రఘబాబు కామెడీ రొటీన్‌గానే ఉన్నా, అది కూడా పండింది.
దర్శకుడిలో మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే… సీన్ కాస్త సీరియస్ మోడ్‌లోకి సాగుతుంది అనుకొంటున్న తరుణంలో కామెడీ యాంగిల్ లో టర్న్ తీసుకోవడం. ఈ పద్ధతి చాలా సీన్స్‌లో కనిపిస్తుంది. మాటలన్నీ ఈ తరానికి నచ్చేలా ఉన్నాయి. భీమ్స్ అందించిన పాటలు యూత్ కి బాగా నచ్చుతాయి. సినిమా మేకింగ్ లో క్వాలిటీ కనిపించింది. `జాతి రత్నాలు కంటే ఎక్కువ నవ్వుతారు.. లేదంటే డబ్బులు వాపస్` అని నిర్మాత నాగవంశీ ఛాలెంజ్ విసిరారు. `జాతిరత్నాలు`తో పోల్చలేం కానీ.. నవ్వులకు మాత్రం ఢోకా ఉండదు. కాలేజీ స్టోరీలు వచ్చి చాలా కాలం అయ్యింది. దానికి తోడు యూత్ ఫుల్ సినిమా ఆయె. ఓ మాదిరిగా నవ్వించినా చాలు.. మేం ఎడ్జస్ట్ అయిపోతాం అనుకొనే పెద్ద మనసు మన ప్రేక్షకులకు ఉంది.కాబట్టి.. బాక్సాఫీసు దగ్గర `మ్యాడ్` జోరుకి ఢోకా ఉండకపోవొచ్చు.
తెలుగు360 రేటింగ్ : 3/5