ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా నాగర్నార్లోని స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించేది లేదని అక్కడి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రకటించారు. నిజానికి ఆ ప్లాంట్ విశాఖ ప్లాంట్ కన్నా ఎక్కువ నష్టాల్లో ఉంది. ఉత్పత్తి కూడా గొప్పగా లేదు. అమ్మడానికి ఏర్పాట్లు చేసింది. వేల్యూయేషన్ చేయించింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ కోరింది. బిడ్డింగ్‌లో జిందాల్ నెంబర్ వన్‌గా నిలిచింది. ఆ సంస్థకు నాగర్నార్ ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. కానీ ఆ స్టీల్ ప్లాంట్ ను అమ్మేది లేదని… అక్కడి ఓట్లకోసం చెబుతున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకునేది లేదని చెబుతోంది. చివరికి కేంద్రంలోని మోడీ సర్కారు వెనక్కి తగ్గక తప్పలేదు.
మన రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో మాత్రం అమ్మి తీరుతామని చెబుతున్నారు. మోడీ సర్కారు ఈ ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తామని 2021 జనవరి 27న ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేవలం రెండు వేల మంది కార్మికులతో ఏటా మూడు లక్షల మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో నాగర్నార్ ప్లాంట్ నడుస్తోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ వేల మంది కార్మికులతో ఏటా 75 లక్షల మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే పరిశ్రమగా ఉక్కు రంగంలో అగ్రగామి సంస్థగా ఉంది.
అయినా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి… ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. అక్కడ బీజేపీ అధికారం కోసం పోరాడుతోంది. ఏపీలో బీజేపీ ఉనికి లేదు. రావాలని అనుకోవడం లేదు. కేసుల భయంతో పాలకుల్ని గుప్పిట పెట్టుకున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ ను అమ్మేసి తీరుతామని నేరుగా చెబుతున్నారు. చత్తీస్ ఘడ్ ప్రజలకు ఉన్నంత పలుకుబడి కూడా ఏపీ వాసులకు లేకుండా పోయిందన్న ఆవేదన అందరిలోనూ ఏర్పడుతోంది.