గత ఆర్టికల్స్ లో ప్రాచీన కాలం లో ఈ ప్రాంతం యూదా రాజ్యంగా ఎలా వర్ధిల్లిందీ, క్రీస్తు పూర్వం 586 సం|| నాటికి బాబిలోనియన్ల చేతిలో ఎలా ఓడిపోయిందీ చూసాం. ఈ ఆర్టికల్ లో ఇది కాల క్రమం లో యూదా రాజ్యం నుండి అరబ్బుల పాలస్తీనా గా ఎలా మారిందీ చూద్దాం.
క్రీస్తుపూర్వం 586 లో బాబిలోనియన్ల దాడి తర్వాత చాలామంది యూదులు తమ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ హేరోదు అనే బలమైన రాజు రావడంతో ఈ ప్రాంతానికి తిరిగి వచ్చారు. క్రీస్తు పూర్వం 20 సంవత్సరం లో హేరోదు పాలనా కాలం లో మళ్లీ జెరూసలేం లో టెంపుల్ నిర్మించుకున్నారు. దీన్ని సెకండ్ టెంపుల్ ఆఫ్ జెరుసలెం అని పిలుస్తారు. అయితే సుమారు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్లు వీరిపై దాడి చేశారు. చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలలో ఒకటి అయిన ఈ యూదా రోమన్ల యుద్ధం లో రోమన్లు గెలిచారు. ఈ యూదా రోమన్ల యుద్ధం తర్వాత యూదులు మళ్లీ ఈ ప్రాంతం నుండి చెల్లాచెదరు అయిపోయారు. అంతేకాకుండా జెరూసలేం లో వీరు నిర్మించుకున్న సెకండ్ టెంపుల్ కూడా రోమన్ల దాడి లో ధ్వంసం అయింది.
క్రీస్తు శకం 6 వ శతాబ్దం లో ప్రారంభమైన ఇస్లాం మతం 7 వ శతాబ్దానికల్లా ఈ ప్రాంతం లో ఒక బలీయమైన మతం గా అవిర్భవించింది. రోమన్ల సామ్రాజ్యం తర్వాత ఈ ప్రాంతం క్రీస్తు శకం 7వ శతాబ్దం సమయంలో ఇస్లాం పాలకులు అయినటువంటి కాలిఫ్ ల చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత 16వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన రాజ్యం అయినటువంటి ఓట్టమన్ సామ్రాజ్యం కిందకు వచ్చింది. ఒకానొక సమయంలో మూడు ఖండాల లో వ్యాపించిన ఈ సామ్రాజ్యం ఇశ్రాయేలు పాలస్తీనా ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం వరకు పరిపాలించింది. బాబిలోనియన్లు, రోమన్ లు మరియు ఇస్లాం పాలకుల దాడి కారణంగా 70% యూదులు తమ ప్రాంతం నుండి వేరు వేరు దేశాలకు వలస వెళ్లిపోగా 30% వరకు మాత్రమే ఈ ప్రాంతంలో మిగిలిపోయారు.
ఈ విధంగా ప్రాచీన కాలం నుండి యూదుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు శకం ఏడవ శతాబ్దం తర్వాత ఇస్లాం పాలకుల చేతిలోకి రావడం, తర్వాత కాలంలో ఈ ప్రాంతంలోని యూదులు ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఈ ప్రాంతం ముస్లిం జనాభా ప్రధానంగా ఉన్న పాలస్తీనా అవతరించింది. పాలస్తీనా అన్న పదం అప్పట్లోని ఫిలిష్తీయుల కారణంగా వచ్చిందని, ఫిలిష్తి అన్న పదానికి వలసవాదులు, చొరబాటుదారులు అన్న అర్థం ఉందని చెబుతారు. అదేవిధంగా ఇజ్రాయిల్ అన్న పదం అబ్రహాము మనవడైన యాకోబు కి ఉన్న మరొక పేరు అని, దీనికి దేవుని చూసిన వాడు అన్న అర్థం ఉందని చెబుతారు.
యూదుల టెంపుల్స్ మరియు అల్ అక్సా మసీదు:
యూదుల టెంపుల్స్ మరియు అల్ అక్సా మసీదు లు ఈ ప్రాంత చరిత్ర కే కాకుండా ప్రస్తుత ఇజ్రాయేల్ – పాలస్తీనా వివాదానికి కూడా ఒక రకంగా కేంద్ర బిందువులు. కాబట్టి వీటి గురించి ఒక సారి క్లుప్తంగా చర్చిద్దాం.
· యూదుల మొదటి టెంపుల్ ని సోలమన్ రాజు క్రీ.పూ. 957 లో అప్పటి రాజధాని అయిన జెరుసలేం లో నిర్మించాడు. ఇది యూదులకి పవిత్ర ప్రదేశంగా ఉండేది. దీనిని క్రీ.పూ. 586 లో బాబిలోనియన్ రాజ్యం వారు ఈ రాజ్యం పై దండెత్తినపుడు ధ్వంసం చేసారు.
· ఆ తర్వాత మళ్ళీ, హేరోదు అనే ఒక బలమైన రాజు తిరిగి యూదా ప్రాంతాన్ని తన ఆధీనం లోకి తెచ్చుకున్న తర్వాత క్రీ.పూ. 20 వ సం|| లో రెండవ టెంపుల్ ని అదే జెరుసలేం ప్రాంతం లో నిర్మించాడు. అయితే క్రీ.శ. 70 వ సం|| లో రోమన్లు వీరిపై దాడి చేసినపుడు దీన్ని ధ్వంసం చేసారు. ఈ సెకండ్ టెంపుల్ శిథిలాల్లో ఒక గోడ మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు యూదులు ఈ గోడ వద్దే గుమికూడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ చిన్న గోడ యూదుల కి అత్యంత పవిత్రమైనది.
· ప్రాచీన కాలంలో యూదుల రాజ్యంగా ఉన్న ఈ ప్రాంతం క్రీస్తుశకం 7 వ శతాబ్దంలో ఇస్లాం పాలకుల చేతిలోకి రాగా, గతంలో యూదుల టెంపుల్ ప్రాంతంలో ఇస్లాం పాలకులు అల్ అక్సా అన్న మసీదుని నిర్మించుకున్నారు. మక్కా, మదీనా తర్వాత ముస్లింలకు మూడవ అతి పవిత్రమైన మసీదు ఇది. మహమ్మద్ ప్రవక్త చివరి రోజుల్లో ఈ మసీదు నుండే స్వర్గానికి వెళ్లిపోయాడని ముస్లిం పవిత్ర గ్రంధాలు చెబుతున్నాయి. రోమనుల దాడి లో యూదుల రెండవ టెంపుల్ ధ్వంసం అయ్యిందని చెప్పుకున్నాం కదా, ఆ శిథిలాల్లో మిగిలిన ఏకైక జ్ఞాపకం ఆ టెంపుల్ కి చెందిన ఒక గోడ. ఈ గోడ ని ఆనుకుని ఈ అల్ అక్సా మసీదు అదే ప్రాంతం లో కట్టబడింది.
·అప్పుడప్పుడు ఇక్కడ చెలరేగే మతపర ఉద్రిక్తతల కు ఇది కూడా ఒక కారణం.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం