29 నవంబర్ 1947 న , ఈ ప్రాంతాన్ని ఇజ్రాయిల్, పాలస్తీనా అంటూ రెండు వేరు వేరు దేశాలుగా విభజించాలని సలహా ఇస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం – యూదులకి వంద సంవత్సరాల కల అయిన Promised Land ని, పాలస్తీనా వాసులకి వంద సంవత్సరాలకి సరిపడేలా “శరణార్థుల సమస్య” ని ఏక కాలం లో సృష్టించింది. అంతర్యుద్ధం. పరస్పర దాడులు, తీవ్ర ఉద్రిక్తతల నడుమ వందేళ్ళ కలను సాకారం చేసుకుంటూ 14 మే 1948 న ఇజ్రాయిల్ తమను ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. ఆ “ప్రకటన” పాలస్తీనా వాసుల శాంతియుత జీవితానికి “చివరి అధ్యాయం” అయింది. పాలస్తీనా శరణార్థుల సమస్య కి బీజం అయింది.
క్రీస్తుపూర్వం వేలాది సంవత్సరాల నుండి ఈ ప్రాంతం యూదా దేశంగా ఎలా ఉంది, తర్వాత ఎలా పట్టు కోల్పోయింది, 1948 లో తిరిగి ఎలా దేశాన్ని ఏర్పరచుకుంది అంటూ ఇప్పటివరకు గత ఆర్టికల్స్ అన్నింటిలో narrative ని ఇజ్రాయిల్ వైపు నుండి చెప్పుకుంటూ వచ్చాం. ముందే చెప్పుకున్నట్టు 1948లో ఇజ్రాయిల్ దేశ ఏర్పాటు ఈ చరిత్రలో ఇంటర్వెల్ బ్యాంగే కానీ క్లైమాక్స్ కాదు. కాబట్టి ఇప్పుడు కాస్త దృక్కోణాన్ని మార్చి పాలస్తీనా వైపు నుండి ఈ అంశాన్ని పరిశీలిస్తే తప్ప పాలస్తీనా శరణార్థుల సమస్య లోని భావోద్వేగం అర్థం కాదు.
1948 మొదటి అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం: ఇజ్రాయిల్ vs ( జోర్డాన్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా మరియు యెమెన్) :
1948 నాటికి 13 లక్షల జనాభా కలిగిన 66% పాలస్తీనా వాసులకు 43% భూభాగాన్ని, 6 లక్షల జనాభా కలిగిన 33% యూదులకు 56% భూభాగాన్ని కేటాయిస్తూ చేసిన తీర్మానాన్ని పాలస్తీనా వాసులే కాకుండా, పొరుగు అరబ్ దేశాలైన జోర్డాన్ , సిరియా, లెబనాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా మరియు యెమెన్ దేశాలు తీవ్రంగా ఖండించి, తిరస్కరించాయి. అయితే వీరి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఇజ్రాయిల్ తమను దేశంగా ప్రకటించుకోవడంతో ఈ అరబ్ దేశాలు ఇజ్రాయిల్ పై యుద్ధానికి దండెత్తాయి. ఇదే మొదటి ఇజ్రాయిల్ యుద్ధం (1948).
ఈ యుద్ధంలో అరబ్ దేశమైన జోర్డాన్ – 1948 ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా అరబ్బులకు కేటాయించబడిన వెస్ట్ బ్యాంక్ (West Bank) ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 5,655 చదరపు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రాంతం జోర్డాన్ నదికి పశ్చిమ గట్టు పై ఉన్నందువల్ల దీనికి “వెస్ట్ బ్యాంక్” అని పేరు. ఈ ప్రాంతాన్ని జోర్డాన్ అధికారికంగా తనలో కలిపిసుకోవడం పట్ల పాలస్తీనా అరబ్బులలో ఎటువంటి వ్యతిరేకత రాలేదు. దీనికి కారణం జోర్డాన్ అలా చేయకపోతే, ఇజ్రాయేల్ ఈ ప్రాంతాన్ని కూడా తమ దేశం లో కలిపేసుకుని తమని తరిమేస్తుందనే భయం.
అదే సమయంలో ఇటువైపు నుండి దండెత్తిన ఈజిప్ట్ – గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఇది కూడా 1948 ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా అరబ్బులకు కేటాయించిన ప్రాంతమే. కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ గాజా ప్రాంతమే తర్వాతి కాలంలో ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం లో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంగా మారింది. గాజా అన్న పదానికి హీబ్రూ లో శక్తివంతమైన నగరం అని అర్థం. ఈ రెండు ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతంలో, తమ కొరకు ఐక్యరాజ్యసమితి కేటాయించిన ప్రాంతం మొత్తాన్ని ఇజ్రాయిల్ కాపాడుకోవడమే కాకుండా పాలస్తీనా కు కేటాయించిన ప్రాంతంలో చాలా భాగాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
అసలు పాలస్తీనా శరణార్థులు అంటే ఎవరు ?
మొదటి అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం (1948) కారణంగా పాలస్తీనా ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పాలస్తీనా కొరకు ఐక్యరాజ్యసమితి కేటాయించిన భూభాగంలో ఒక భాగం జోర్డాన్ ఆధీనంలోకి, ఒక భాగం ఈజిప్ట్ ఆధీనంలోకి వెళ్ళిపోగా మిగిలిన భాగంలో చాలా వరకు ఇజ్రాయిల్ ఆధీనంలోకి వెళ్లిపోయింది.
యుద్దానికి ముందు 13 లక్షల జనాభా కలిగిన పాలస్తీనా అరబ్బులలో సుమారు ఏడున్నర లక్షల మంది ఈ సమయంలో శరణార్థులు గా (Refugees) మారిపోయారు. ఈ 1948 అరబ్ ఇజ్రాయిల్ యుద్ధ సమయంలోనే కాకుండా, తర్వాతి కాలంలో జరిగిన అనేక యుద్ధాల సమయాల లో ఆశ్రయం కోల్పోయి, దేశాన్ని కోల్పోయి, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరాల లోనో లేదంటే పొరుగు దేశాలలో పౌరసత్వం కానీ పూర్తిస్థాయి హక్కులు కానీ లేకుండా ద్వితీయ శ్రేణి పౌరులు గానో, లేదంటే అంత కంటే దీనమైన జీవితాన్నో నివసిస్తున్న పాలస్తీనా అరబ్బులని అంతర్జాతీయ సమాజం “పాలస్తీనా శరణార్థులు” గా గుర్తిస్తోంది.
UNRWA అనే ఐక్య రాజ్య సమితి సంస్థ అధికారిక లెక్కల ప్రకారం, ప్రస్తుతం సుమారు 60 లక్షల మంది పాలస్తీనా వాసులు శరణార్థులు గా నమోదై ఉన్నారు.. ఈ శరణార్థులలో 40% జోర్డాన్ లో, 10% సిరియాలో మరియు 8% లెబనాన్లో, మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. శరణార్థులు గా జీవిస్తూ, జీవితం తో యుద్దం చేస్తున్నారు.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం