శరణార్థుల శిబిరాలు అంటే చాలా మంది మన వద్ద పెళ్లిళ్ల లో వేసే షామియానా ల లాంటివో లేక గుడ్డలతో చేసిన టెంట్ ల లాంటివో అనుకుంటారు కానీ అది నిజం కాదు. ఈ శరణార్థుల శిబిరాలు కూడా కాంక్రీట్ తో చేసిన సాధారణ ఇళ్ళ కాలనీ ల లాంటివే. కాకపోతే పదివేల మంది నివసించ గలిగిన ప్రాంతంలో దాదాపు 50 వేల మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇలాంటి కాంక్రీట్ కాలనీ శిబిరాలు, 1949 లో ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ( UNRWA ) ఆధ్వర్యంలో గాజా, వెస్ట్ బ్యాంక్ ల తో పాటు పాలస్తీనా వాసులు శరణార్థులుగా వెళ్లిన ఇరుగు పొరుగు దేశాలలో చాలానే ఏర్పాటు అయ్యాయి.
1948 అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం తర్వాత నిరాశ్రయులుగా మారిన శరణార్థులకు ఆశయం తో పాటు విద్య, ఆరోగ్య వసతులు మరియు ఇతరత్రా మానవతా సాయం అందించాల నే ఏకైక ఉద్దేశంతో, కేవలం పాలస్తీనా శరణార్థుల కోసమే ఈ UNRWA సంస్థ మొదటి అరబ్ ఇజ్రాయేల్ యుద్దం తర్వాత డిసెంబర్ 1949 లో ఏర్పాటయింది.
1967 మూడవ అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం – ఆరు రోజుల యుద్ధం:
1948 మొదటి అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం లో ఇజ్రాయిల్ – ఐక్య రాజ్య సమితి ద్వారా తమ కి కేటాయించబడిన ప్రాంతాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా పాలస్తీనా కి కేటాయించిన ప్రాంతంలో చాలా భాగాన్ని ఆక్రమించుకుని పై చేయి సాధించింది. ఈ కారణం చేత, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల, అలాగే రెండు దశాబ్దాల సమయం లో మారిన geopolitical equations (కోల్డ్ వార్, చమురు రాజకీయాలు, సూయజ్ కాలువ ఈజిప్ట్ జాతీయం తర్వాతి పరిస్థితులు వగైరా ) వల్ల అరబ్ రాజ్యాలు అయిన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా మరియు లెబనాన్ దేశాలు 1967 లో ఇజ్రాయిల్ పై మళ్ళీ దాడి చేశాయి. మొదట కాస్త తడబడ్డ ఇజ్రాయిల్, ఆ తర్వాత తేరుకుని కేవలం ఆరంటే ఆరు రోజులలో అరబ్ దేశాల పై స్పష్టమైన విజయాన్ని సాధించింది. ఆరు రోజుల్లో అంత పెద్ద దేశాలపై అంత స్పష్టమైన విజయం సాధించడం అన్నది ఆషామాషీ సంగతి కాదు. అందుకే ఇది చరిత్ర లో “ఆరు రోజుల యుద్దం” గా ప్రఖ్యాతి గాంచింది.
ఈ యుద్ద ఫలితం గా – 1948 లో ఈజిప్ట్ ఆధీనం లోకి వెళ్ళి పోయిన పాలస్తీనా ప్రాంతమైన గాజా ని, జోర్డాన్ ఆధీనం లోకి వెళ్లిపోయిన పాలస్తీనా ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్ ని మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఇజ్రాయిల్. దీంతో కొన్ని చెదురు ముదురు ప్రాంతాలు తప్ప 1948 కి ముందు పాలస్తీనా దేశం గా ఉన్న పూర్తి ప్రాంతం ఇజ్రాయిల్ ఆధీనంలోకి వచ్చినట్లయింది.
సమస్య మరింత జటిలం, తరతరాలుగా శిబిరాల్లోనే శరణార్థుల జీవితం
దీంతో పాలస్తీనా వాసులు పొరుగు అరబ్ దేశాలకు శరణార్థులు గా వెళ్లడం విపరీతంగా పెరిగిపోయి, ఆ తర్వాత కూడా దశాబ్దాల పాటు కొనసాగింది. ఎంతగా అంటే ఇప్పుడు జోర్డాన్ దేశంలో ఉన్న జనాభాలో సుమారు 50 శాతం మంది పాలస్తీనా మూలాలు కలిగిన వాళ్లే. అలాగే ఈజిప్ట్, సిరియా, లెబనాన్ లాంటి దేశాల లో సైతం గణనీయ సంఖ్యలో శరణార్థులు ఉన్నారు. ఈ దేశాలలో వీరికి పౌరసత్వం కానీ పూర్తి స్థాయి హక్కులు కానీ ఉండవు (జోర్డాన్ కొంత వరకు నయం). చాలా వరకు ఐక్యరాజ్యసమితి సంస్థ UNRWA ఏర్పాటు చేసిన శిబిరాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువైన జీవితాన్ని సాగిస్తున్నారు.
చెబితే వినడానికి, నమ్మడానికీ ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, వీరిలో చాలా మంది 1948 మొదటి అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో, 1967 యుద్ధం సమయంలో, ఈ శరణార్థ శిబిరాలకు వచ్చి, దాదాపు నాలుగు తరాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. చాలా మంది ఈ శిబిరాల లో పుట్టి ఈ శిబిరాలల్లోనే పెరిగి, పూర్తి జీవితాన్ని ఈ శిబిరాల్లోనే జీవించేశారు. ఇప్పటికీ బతికి ఉన్న ఇంకొందరు వృద్ధులు 1948, 1967 నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అప్పట్లో తమ తల్లిదండ్రులు వారం లేదా పది రోజులలో తిరిగి తమ గ్రామానికి వెళ్ళిపోతామన్న ధీమా తో ఈ శిబిరాలకు వచ్చారని, కానీ నాలుగు తరాలుగా ఇక్కడే జీవించాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతూ చెబుతున్నారు. కొందరిలో ఇప్పటికీ ఆనాటి తమ పాలస్తీనా గ్రామాలకు తిరిగి వెళ్తాం అన్న నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ అసలు ఆ గ్రామాలే ఉనికి లో లేవు అన్న వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడని గుడ్డి నమ్మకం అది.
10 సార్లు యుద్దం జరిగితే ఒక్క యుద్దం కూడా ఓడిపోని ఇజ్రాయేల్:
1948 వరకు ప్రపంచంలోని ఇతర దేశాల పౌరులందరి లాగానే సామాన్య జీవితం గడిపిన పాలస్తీనా వాసుల భవిష్యత్తు, వారి తర్వాతి తరాల భవిష్యత్తు ఒక్క ఇజ్రాయిల్ దేశ ఏర్పాటుతో తలకిందులై పోయింది. 1948, 1956, 1967, 1973, 1982, 1993, 2005, 2006, 2012 – ఇలా ఎన్ని సార్లు యుద్దాలు చేసినా, ఎన్ని సార్లు దాడులు చేసినా, ప్రతి సారీ ఇజ్రాయేల్ దేశం శత్రు వర్గాలని మట్టి కరిపించడం తో పాటు వారి ఆధీనం లో ఉన్న ఇంకొద్ది భూభాగాన్ని లాగేసుకోవడం అనే తంతు దశాబ్దాలుగా జరుగుతూ వస్తోంది. ప్రతి యుద్దం, ప్రతి దాడి, పాలస్తీనా పరిస్థితి ని మరింత దిగజారుస్తూ వస్తోంది.
అయితే చాలా మందికి ఒక అనుమానం రావొచ్చు, పాలస్తీనా సమస్య కోసం ఎంతసేపూ అరబ్ దేశాలే పోట్లాడాయా ? పాలస్తీనా వాసులు తిరగబడలేదా? పోరాడలేదా? అని. ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే 1964 లో ఏర్పడ్డ పాలస్తీనా విమోచన సంస్థ ( Palestine Liberation Organization) గురించి, ఒకానొక సమయం లో గెరిల్లా యుద్దం చేసి, ఆ తర్వాతి రోజుల్లో నోబెల్ శాంతి బహుమతి ని కూడా పొందిన యాసర్ అరాఫత్ గురించి, ఇప్పుడు ఇజ్రాయేల్ తో ఊపిరి సలపని యుద్దం చేస్తున్న హమాస్ గురించి తెలుసుకోవాలి.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య